Jul 03,2022 23:20

సత్తెనపల్లిలో 50 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన చేస్తున్న ప్రజా సంఘాలు

ప్రజాశక్తి - మాచర్ల : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధనకు మరోసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సభలు నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా మాచర్ల పట్టణంలోని అల్లూరి సీతారామరాజు జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ భారత జాతీయోద్యమం ఎంతో మహోన్నతమైందని, సీతారామరాజు, భగత్‌సింగ్‌ వంటి నాయకులు చిన్న వయస్సులోనే ప్రాణత్యాగాలు చేశారని కొనియాడారు. బ్రిటిష్‌ హయాంలో మన్యం ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు ఉద్యమించారని తెలిపారు. మన్యం ప్రజలను సంఘటిత పరిచి చేసిన పోరాటం మహోన్నతమైందని చెప్పారు. అల్లూరి సీతారామరాజును అడ్డుకునేందుకు ఆ ప్రాంత కలెక్టర్‌గా రూధర్‌ఫర్డ్‌ను అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిందని, ఆయన ప్రభుత్వానికి నివేదించిన అంశాల ఆధారంగా మన్యం ప్రజలు ఎంత దోపిడీకి గురవుతున్నారో వెలుగులోకి వచ్చాయని తెలిపారు. అయితే మన్యం ప్రజలు నాటికి, నేటికి ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ వెనకబడే ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. సమాజంలో ఈ అంతరాలను రూపుమాపడానికి అల్లూరి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయ కులు గుంటూరు విజరుకుమార్‌, ఏపూరి గోపాలరావు, మహేష్‌, రాజు, జెవికెఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : సత్తెనపల్లి పట్టణంలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 50 మీటర్ల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన చేశారు. స్థానిక పుతుంబాక భవన్‌ నుండి బయలుదేరిన ప్రదర్శన గార్లపాడు బస్టాండ్‌ సెంటర్‌, గడియార స్తంభం సెంటర్‌, మీదుగా తాలూకా సెంటర్‌ వరకు సాగింది. తాలూకా సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన సభలో రైతు సంఘం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని చెప్పారు. అయితే స్వాతంత్య్ర పోరాటంలో ఏ మాత్రమూ చరిత్ర లేని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు నేడు దేశాన్ని పాలిస్తున్న దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. వాటి నుండి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు డి.విమల, సిఐటియు నాయకులు జి.మల్లే శ్వరి, డివైఎఫ్‌ఐ నాయకులు పి.మహేష్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - నరసరావుపేట : స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సభకు సిపిఎం నాయకులు కె.రామారావు అధ్యక్షత వహించారు. సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌, నాయకులు శ్యాంప్రసాద్‌, కె.రాంబాబు మాట్లాడారు. రామారావు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేని బిజెపి ఇప్పుడు సీతారామరాజు జయంతి పేరుతో హడావుడి చేస్తోందని, ఆ పార్టీకి ఆ అర్హత లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే వారిని బిజెపి ప్రభుత్వం అణచివేస్తోందని, రాష్ట్రాల హక్కులను సైతం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజలల్లో మత చీలికలు తెచ్చి సృష్టిస్తున్న అలజడులను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యమవ్వాలని కోరారు. సిపిఎం నాయకులు కె.ఆంజనేయులు, సయ్యద్‌ రబ్బాని, సుభాష్‌ చంద్రబోస్‌, ఐ.కోటేశ్వరరావు సిపిఐ కార్యకర్తలు వెంకట్‌, రంగయ్య, సైదా పాల్గొన్నారు.
ప్రజాశక్తి - క్రోసూరు : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ జి.రవిబాబు అన్నారు. మండల కేంద్రమైన క్రోసూరులోని ఆమంచి భవన్లో అల్లూరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. రవిబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం కోసం గిరిజనులను అల్లూరి ఏకం చేసి పోరాడారని, అయితే ప్రస్తుత గిరిజన హక్కులను కాలరాజేలా, అటవీ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పేలా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు, గ్రామ శాఖ కార్యదర్శి చిలక యేసయ్య పాల్గొన్నారు.