Jul 03,2022 23:26

గుంటూరులో అల్లూరి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు, నాజ్‌ సెంటర్‌లో ఉన్న అల్లూరి విగ్రహానికి సిపిఎం, సిపిఐ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ బీమవరంలో అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించటానికి వస్తున్నారని, అయితే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, విహెచ్‌పి వంటి సంస్థలకు చెందిన వారు ఒక్కరూ పాల్గొనలేదని గుర్తు చేశారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ, ప్రజలకు ద్రోహం చేస్తున్నారన్నారు. అటువంటి నేతలు ప్రజలందరి కోసం పోరాడిన అంబేద్కర్‌, భగసింత్‌, అల్లూరి వంటి వారిని మతానికి పరిమితం చేయాలనే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమంలో, గిరిజన హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఆదర్శంగా పని చేశారన్నారు. గిరిజనుల్ని బ్రిటీషు వారు దోపిడీ చేస్తుంటే చలించి ఉద్యమంలోకి వచ్చి, గిరిజనుల్ని మొత్తాన్ని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబెట్టారని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమం కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించారన్నారు. అంటరానితనం, మతత్వం, ప్రాంతీయ తత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి విగ్రహాన్ని కులతత్వం, మత రాజకీయాలకు ప్రతినిధి అయిన మోడీ ఏ మొహం పెట్టుకొని ఆవిష్కరిస్తారని ప్రశ్నించారు. గిరిజనుల ఓట్ల కోసమే ఆల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారన్నారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే అల్లూరికి అర్పించే నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌, సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు కె.నళినీకాంత్‌, కె.మాల్యాద్రి, కె.శ్రీనివాస్‌, అరుణ, ముత్యాలరావు, నికల్సన్‌, సిపిఐ నాయకులు ఎన్‌.చిన్న, రావుల అంజిబాబు, నాసర్‌జీ, ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.