Jul 03,2022 23:25
చింతూరులో విగ్రహాలకు నివాళి అర్పిస్తున్న సీతారాం, నాయకులు

ప్రజాశక్తి- చింతూరు : దేశ స్వాతంత్రం కోసం పోరాడి నేలకొరిగిన భగత్‌సింగ్‌ సమకాలికుడు అల్లూరి అందరివాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. చింతూరు మండలం ఎర్రంపేటలో అల్లూరి 125వ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరితోపాటు గంటందొర, మల్లుదొర, కొమరంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరాఉ. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు సీసం సురేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ, 20ఏళ్ల చిరుప్రాయంలోనే స్వాతంత్య్రం కోసం, దోపిడీకి గురౌతున్న అమాయక ఆదివాసీల విముక్తి కోసం బ్రిటీషర్లపై తిరుగుబావుటా ఎగరేసి అల్లూరి పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ఆదివాసీలకు చదువు నేర్పుతూ వారి మూఢనమ్మకాలను పారదోలడంతోపాటు మూలికా వైద్యం అందించేవాడన్నారు. మల్లుదొర, గంటందొర, పడాలు వంటి గిరిజన పోరాట నాయకులను తయారుచేసి బ్రిటిష్‌ వారి పాలిట సింహస్వప్నంగా నిలిచారన్నారు.
రంపచోడవరం జిల్లా కార్యదర్శి కిరణ్‌ మాట్లాడుతూ గిరిజనానికి కొండపోడుపట్టాలు, పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతీరుపై పోరాడదామన్నారు
.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజల హక్కులపై దాడులు చేస్తూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛ హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం చేయడమే అల్లూరికి నిజమైన నివాళి అన్నారు. సదస్సుకు ముందు అల్లూరి సీతారామరాజు జయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పునేమ్‌ సత్యనారాయణ, పల్లపు వెంకట్‌, వి.ఆర్‌.పురం ఎంపీపీ కారం లక్ష్మి,మాజీ జెడ్పిటిసి ముర్రం రంగమ్మ, వి.ఆర్‌.పురం సిపిఎం మండల కార్యదర్శి రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సర్పంచ్‌ పులి సంతోష్‌,యువజన సంఘం నాయకుడు వివేక రాజ్‌ కుమార్‌, సిఐటియు చింతూరు మండల అధ్యక్షుడు పి లక్ష్మణ్‌, సిపిఎం మండల కమిటీ సభ్యులు మొతుమ్‌ రాజయ్య,సుబ్బారావు, కారం నాగేష్‌ పాల్గొన్నారు
రాజవొమ్మంగి : స్థానిక అల్లూరి జంక్షన్‌ వద్ద అల్లూరి సీతారామరాజు అల్లూరి విగ్రహానికి గిరిజన సంఘం, సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఇతర ప్రజాసంఘాల నేతలు సింగిరెడ్డి అచ్చారావు, పి రామరాజు, టి శ్రీను, పి శ్రీను, ఎస్‌ నాగు, కె రాంబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్రిటీషర్లను గడగడలాడించి, తెల్లదొరలకు తెలుగువారి పౌరుష ప్రతాపాలను చూపించిన సీతారామరాజు దేశానికి స్వాతంత్య్రం, స్వరాజ్యం కావాలని మొట్టమొదటిగా నినదించారని, మన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సత్తిబాబు,కె రాంబాబు,కె జగన్నాదం,పి బుజ్జి,రాజేష్‌ పాల్గొన్నారు.
మైదానప్రాంతంలో..
రాజవొమ్మంగి: మండలంలోని లోతట్టు ప్రాంతమైన లోదొడ్డి పంచాయతీ, పూదీడు గ్రామంలో గిరిజన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గిరిజన సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు, లోదొడ్డి సర్పంచ్‌ లోతా రామారావు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా అల్లూరి ఆశయాలు నేటికీ అమలు కాలేదన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పి రాజు బాబు, ఎం రమేష్‌,జె రాజు పాల్గొన్నారు.
ఎటపాక : సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఆదివాసి హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు అన్నారు. మాధవరావు పేటలో ఇరపా అజరు అధ్యక్షతన అల్లూరి జయంతిలో ఎటపాక వైస్‌ ఎంపిపి పెనుబల్లి కుమారి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాకా అర్జున్‌ దొర, పొడియం రత్తమ్మ , సవలం రాము, పెనుబల్లి వెంకన్నబాబు, జలకం ముద్దరాజు, సవలం చంద్రయ్య, ముర్రం వెంకటేష్‌, ముత్తయ్య పాల్గొన్నారు.
పాడేరు: అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న బిజెపి ప్రభుత్వానికి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు లేదని అల్లూరి జిల్లా సిపిఐ కన్వీనర్‌ పొట్టిక సత్యనారాయణ పేర్కొన్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకను సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి లింగేరి సుందరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అల్లూరి చేసిన పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. బ్రిటిష్‌ పాలకుల నుంచి భారత దేశాన్ని విముక్తి కలిగించేందుకు పోరాటం చేసి ప్రాణాలర్పించారని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ప్రభుదాస్‌, శెట్టి నాగరాజు, సిపిఐ నాయకులు కూడ రాధాకృష్ణ, దిసరి బిమలమ్మ, జల్లి రాజుబాబు, చిన్న, రాంబాబు, మువ్వల లక్ష్మణరావు, రాజు, పేతురు, తదితరులు పాల్గొన్నారు.
అరకులోయరూరల్‌:మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ బంగ్లవలస గ్రామంలో ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుంకరమెట్ట సర్పంచ్‌ జి.చిన్నబాబు మాట్లాడుతూ, బ్రిటీష్‌ ప్రభుత్వం అణిచివేతకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి అని కొనియాడారు. దేశభక్తిని రగిలించి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా అల్లూరి సీతారామరాజు నిలిచారన్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే గొప్ప విప్లవ వీరుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కె.రామారావు, నాయకులు జి.బుజ్జి బాబు, పాంగి నానిబాబు, భవాని, సింహాచలం, సంజరు, బైరాగి, గ్రామ పంచాయతీ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.