Jul 03,2022 22:50


ప్రజాశక్తి - ఏలూరు కల్చరల్‌
             రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి అల్లూరి సీతారామ రాజు విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని వామపక్ష పార్టీలు విమర్శించాయి. ఆదివారం ఏలూరు జ్యూట్‌ మిల్‌ సెంటర్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎం యల్‌) న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గో బ్యాక్‌ అంటూ నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వతంత్య్రం కోసం బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి అని కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడి తన ప్రాణాలను సైతం అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి అని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో సంఘ పరివార్‌, దాని వారసులైన బిజెపికి ఎలాంటి పాత్రా లేదన్నారు. అంతేకాకుండా స్వతంత్య్ర పోరాటంలో సంఘ పరివార్‌ శక్తులు బ్రిటిషు తొత్తులుగా వ్యవహరించారని గుర్తు చేశారు. సంఘపరివార్‌ వారసుడు నరేంద్ర మోడీకి అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదన్నారు. మోడీ సామ్రాజ్యవాద దేశాలకు, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నారన్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు వస్తున్న మోడీ పర్యటనను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. మోడీ మన రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. అంతేకాకుండా ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతూ దేశ సంపదను సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. దేశంలో రైతుల, కార్మికుల, ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరిస్తున్నారన్నారు. అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ నిర్ణయం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి, మోడీ పర్యటనను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌, సిపిఐ ఎంఎల్‌న్యూ డెమోక్రసీ నాయకులు బద్ద వెంకట్రావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య, కె.శ్రీనివాస్‌, నగర కమిటీ సభ్యులు సాయిబాబు, సిపిఐ నగర కన్వీనర్‌ ఉప్పులూరి హేమశంకర్‌, నాయకులు పుప్పాల కన్నబాబు, పొట్టేలు పెంటయ్య, పోలా భాస్కర్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో అడ్డగర్ల శైలేష్‌, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు కాకర్ల అప్పారావు, యర్రా శ్రీనివాసరావు, ఐఎఫ్‌టియు నాయకులు మంగం అప్పారావు, కె.చిట్టయ్య, మీసాల రమణ, పిడిఎస్‌యు నాయకులు ఎం.క్రాంతి, ఎం.జానకీరామ్‌ పాల్గొన్నారు.
వేలేరుపాడు : మోడీ రాకను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం, సిపిఐ కార్యాలయాల నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ కూడలిలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ధర్ముల రమేష్‌ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు మడివి దుర్గారావు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎమ్‌డి మునీర్‌ మాట్లాడుతూ గిరిజన హక్కులను, అటవీ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతూ అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న మోడీ సర్కార్‌కు ఆయన జయంత్యుత్సవాలు చేసే అర్హత లేదన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని కేంద్రం నీరుగార్చి గిరిజనులకు అడవిపైన, అటవీ భూములపైన ఉన్న హక్కును తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపుతారా లేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు పరిహారం, పునరావాసానికి నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మోడీ బిజెపికి స్వాతంత్య్ర ఉద్యమంలో ఏమాత్రమూ పాత్ర లేని వారు అల్లూరిని స్మరించుకోవడం తెలుగు రాష్ట్ర ప్రజలను మెసం చేయడమేనని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో బిజెపి ఇచ్చిన హామీలు అమలు చేయాకుండా, పోలవరం ప్రాజెక్టుకు, గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించకుండా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కార్పొరేట్లకు కారుచౌకగా అమ్మేస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వం స్వాత్రంత్య్ర ఉద్యమకారుల పేరుతో తెలుగు ప్రజలకు చేరువ అయ్యేందుకు విశ్వాప్రయత్నాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. ఎపికి విభజన హామీలు, ప్రత్యేక హోదాను మోడీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బాడిశ రాము, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కారం వెంకట్రావు, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కారం దారయ్య, కెవిపిస్‌ రాష్ట్ర నాయకులు కొక్కిరపాటి రవీంద్ర, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు యర్రా మధు, వీరయ్య, వెంకటేశ్వర్లు, నాగు, ప్రసాద్‌ పాల్గొన్నారు.