Feb 28,2021 21:42

అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా ఎసిబి దాడులు చేస్తుండటంతో దేవాదాయశాఖ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆలయాల్లో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలపై ఇటీవల కాలంలో పెద్దఎత్తున ఎసిబి అధికారులకు ఫిర్యాదులందుతున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నాలుగు రోజులు వరుసగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి పాఠకులకు విధితమే. ఆలయంలోని పలు విభాగాల్లో అవకతవకలు, అక్రమాలు, జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యులుగా ఏడుగురు సూపరింటెండెంట్లు, మరో ఏడుగురు సిబ్బందిపై దేవాదాయ శాఖ అదనపు కమిషనరు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆలయంలో జరిగిన అవినీతి అంతా ఇఒ సురేష్‌బాబు కనుసన్నల్లోనే జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించి చర్యల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, కుంభకోణాలపై ఎసిబి అధికారులు గతేడాది జూన్‌లో దాడులు చేశారు. ఇందుకు సంబంధించి ప్రధానంగా 2016 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఇదే అంశంపై దేవాదాయ శాఖ అడిషనల్‌ కమిషనరు రామచంద్రమోహన్‌ విచారణ చేపట్టారు. విచారణలో రూ.2.50 కోట్లు సాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్‌ ద్వారా జరిగినట్లు రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అంగీకరించినట్లు ఎండోమెంటు ఉన్నతాధికారులు అప్పట్లో ప్రకటించారు. ఇందుకు సంబంధించి సుమారు రూ.86 లక్షలు రికవరీ చేశారు. 16 మంది రెగ్యులర్‌ సిబ్బంది, మరో 23 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో గతేడాది సెప్టెంబరులో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, నగదు నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. సింహాచలం ఆలయంలో కూడా పలు అవకతవకలు జరిగాయంటూ గతంలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో శాఖా పరమైన చర్యలు చేపట్టారు. ఎసిబి దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఏ దేవాలయంలో ఎప్పుడు ఎసిబి దృష్టి సారిస్తుందోననే భయం దేవాదాయశాఖ అధికారులను వెంటాడుతోంది. అయితే ఎసిబి నివేదికలు చేరిన తర్వాత చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందనే విమర్శలూ లేకపోలేదు.