Jul 03,2022 22:56
  • హోదా, విభజన హామీలపై రాష్ట్రానికి బిజెపి ద్రోహం
  • సీతారామరాజు విగ్రహానికి మోడీ రానుండడం సిగ్గుచేటు
  • గిరిజన హక్కుల పరిరక్షణే అల్లూరికి నిజమైన నివాళి

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు వామపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన ఆధ్వర్యాన ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు, సిపిఎం, సిపిఐ, సిపిఐఎం న్యూడెమోక్రసీ, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, యుటిఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తోన్న బిజెపికి అల్లూరి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో బిజెపి ద్రోహం చేసిందన్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు మోడీ రానుండడం సిగ్గుచేటన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణే అల్లూరికి నిజమైన నివాళని పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పదును పెడతామని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్‌ వద్ద అల్లూరి విగ్రహానికి వామపక్ష నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నిట్‌కు, ఉభయగోదావరి జిల్లాలను కలిపే బ్రిడ్జిల్లో ఒక దానికి అల్లూరి పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం చౌక్‌లో రోడ్డు పక్కన ఉన్న అల్లూరి విగ్రహాన్ని రోడ్డు మధ్యలో నిర్మిస్తోన్న వాటర్‌ ఫౌంటేన్‌ మధ్యలో పెట్టాలని కోరారు. పాత బస్‌ స్టాండ్‌ సమీపంలో శిథిలావస్థకు చేరిందనే కారణంతో కొల్లగొట్టిన అల్లూరి స్మారక భవనం ప్రాంతంలో ఐదంతస్తుల భవనం పున:నిర్మించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, సభలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఎర్రంపేటలో అల్లూరి 125వ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర, కొమరం భీమ్‌ విగ్రహాలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంపచోడవరం, రాజవొమ్మంగి, ఎటపాక, అరకులోయ మండలాల్లో అల్లూరికి నివాళ్లర్పించారు. విశాఖలోని బీచ్‌ రోడ్డులో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన యూత్‌ మార్చ్‌, సభ జరిగింది. వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యాన పాత గాజువాకలో ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురంలోని ఎపి ఎన్‌జిఒ హోంలో నిర్వహించిన అల్లూరి జయంతి సభలో అభ్యుదయ రచయిత, కవి గంటేడ గౌరినాయుడు, ప్రజా సంఘాలు, వామపక్షాల నాయకులు పాల్గని అల్లూరికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో శ్యామ్‌ జాదుగర్‌ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వేషధారణల పోటీని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యా నిరసన ప్రదర్శన జరిగింది. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గోబ్యాక్‌, విదేశీ కార్పొరేట్‌ శక్తుల కొమ్ముకాచే మోడీ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. తిరుపతిలో అల్లూరు జయంత్యుత్సోవాల్లో ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి పాల్గని ప్రసంగించారు. పల్నాడు జిల్లా మాచర్ల సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన అల్లూరి జయంతిలో ఎంఎల్‌సి కె.ఎస్‌.లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా పాల్గని ప్రసగించారు. గుంటూరులోని నాజ్‌ సెంటర్‌లోగల అల్లూరి విగ్రహానికి సిపిఎం, సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నంద్యాల, కృష్ణా, విజయవాడ, అనంతపురం, అన్నమయ్య, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అల్లూరి జయంతి ఘనంగా నిర్వహించారు.