Oct 17,2020 16:06

చెన్నై : మాజీ శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్రతో రూపొందుతున్న ''800'' సినిమా తమిళనాడులో వివాదాస్పదమైంది. అమాయక తమిళ ప్రజలను హత్య చేయడంపై తాను సంతోషంగా ఉన్నానని 2009లో ముత్తయ్య మురళీధరన్‌ వ్యాఖ్యానించినట్లు పలు తమిళ సంఘాలు, రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ''ఇరు వైపులా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న శ్రీలంక - తమిళుల మధ్య వివాదం 2009లో ముగిసిందని, ఆరోజు నాజీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని పేర్కొన్నట్లు మురళీధరన్‌ అన్నారు. అయితే తమిళులను హత్య చేయడంతో ఆ రోజు తనకు సంతోషకరమైన రోజని పేర్కొన్నట్లు తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మురళీధరన్‌ అన్నారు. అలాగే అమాయకులను హత్య చేయడాన్ని తాను ఎప్పటికీ సమర్థించనని, తాను భవిష్యత్తులో ఎప్పటికీ అలా చేయనని ఈ సందర్భంగా అన్నారు. కాగా, ఈ బయోపిక్‌లో తమిళ నటుడు విజరు సేతుపతి హీరోగా నటిస్తున్నారు. తన తల్లిదండ్రులు, ఆ వివాదంలో మరణించిన పలువురు వ్యక్తులకు గుర్తింపు తెచ్చేందుకు ఈ సినిమా రూపొందించేందుకు అంగీకరించానని మురళీధరన్‌ అన్నారు.
కాగా, తమిళులకు, శ్రీలంకకు మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. ఎల్‌టిటిఇ అధినేత ప్రభాకరన్‌ను శ్రీలంక బలగాలు అత్యంత కిరాతకంగా తమిళులను హత్య చేశాయి. ఎల్‌టిటిఇతో జరిగిన తుది సమరంలో పెద్ద ఎత్తున మానవహక్కుల అణచివేత కొనసాగింది. శ్రీలంక సైన్యం జరిపిన బాంబుల దాడుల్లో, కాల్పుల్లో లక్షలాది మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మురళీధరన్‌ చిత్రంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమిళులు చనిపోతున్నపుడు ముత్తయ్య లంక తరుపున క్రికెట్‌ ఆడారని, తన సొంత జాతి ప్రజలు మరణిస్తున్న సమయంలో ఆ దేశం తరుపున ఒక ఆటగాడిగా విజయదరహాసం చేయడం వల్ల ఉపయోగం ఏముందని ప్రముఖ దర్శకుడు, నిర్మాత భారతీరాజా ప్రశ్నించారు. ఆయన మమ్మల్ని దారుణంగా వంచించారని అన్నారు.