Nov 21,2021 08:06

నటి రేవతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు భాషల్లో ఆమె నటించిన సినిమాలే ఆమె అభినయం ఏపాటిదో మనకు చెబుతాయి. అలాంటి నటి కొన్నాళ్ల క్రితమే దర్శకురాలిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, ఇంగ్లీష్‌, మలయాళంలో ఇప్పటికే నాలుగు సినిమాలు డైరెక్ట్‌ చేసి, ప్రతిభావంతమైన దర్శకురాలిగానూ పేరుతెచ్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె మరో చిత్రానికీ దర్శకత్వం వహించనున్నారు. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. అనేక సందర్భాల్లో తన గొంతును బలంగా వినిపించారు కూడా. ఇటీవల 'ఇట్లు అమ్మ' చిత్రంలోనూ ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు. ఈ నేపథ్యంలో ఆమె గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం..!

        చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కళ్లతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదమి విప్పితే ఆమె చిరునవ్వు, ముత్యాల్లాంటి పళ్లు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయం ఆకట్టుకుంటుంది. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన 'మణ్‌ వాసనై' తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు రేవతి.
రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన 'మానస వీణ' చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టారు రేవతి. అదే సమయంలో బాపు తెరకెక్కించిన 'సీతమ్మ పెళ్లి' కూడా రేవతికి మంచి పేరు సంపాదించింది. మణిరత్నం 'మౌనరాగం'తో రేవతికి మరింత పేరు లభించింది. తెలుగులో అనువాదమైన ఈ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. అప్పటి నుంచీ తమిళంలో రేవతి నటించిన పలు చిత్రాలు తెలుగువారినీ అనువాదరూపంలో పలకరించాయి. ఏఎన్‌ఆర్‌ 'రావుగారిల్లు'లో నటించిన రేవతి తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. వెంకటేశ్‌తో కలసి ఆమె నటించిన 'ప్రేమ' నటిగా మరిన్ని మార్కులు సంపాదించి పెట్టింది. 'అంకురం' చిత్రంలో రేవతి నటనకు ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డు లభించింది. రామ్‌గోపాల్‌ వర్మ 'గాయం'లోనూ రేవతి తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రభాస్‌ తొలి చిత్రం 'ఈశ్వర్‌' తర్వాత దాదాపు ఎనిమిదేళ్లు తెలుగు చిత్రాల్లో కనిపించలేదు రేవతి. అయితే మధ్యలో ఆమె నటించిన అనువాద చిత్రాలు మాత్రం బాగానే జనాన్ని ఆకట్టుకున్నాయి. నవతరం కథానాయకుల చిత్రాల్లో వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తున్నారు రేవతి. 'అనుక్షణం, లోఫర్‌, సైజ్‌ జీరో, బ్రహ్మోత్సవం, యుద్ధం శరణం, మేజర్‌' వంటి చిత్రాల్లో కనిపించి, అలరించారు రేవతి.
దర్శకురాలిగా..
కేవలం నటిగానే కాదు, దర్శకురాలిగానూ రేవతి తనదైన బాణీ పలికించారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం 'మిత్ర్‌, మై ఫ్రెండ్‌' ఇంగ్లీష్‌ సినిమా కావడం విశేషం. దీనికి నేషనల్‌ అవార్డు లభించింది. శోభన ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రాన్ని రేవతి భర్త, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సురేశ్‌చంద్ర మీనన్‌ నిర్మించారు. రేవతి, సురేశ్‌ మీనన్‌ కొన్నాళ్లకే అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత సల్మాన్‌ఖాన్‌, శిల్పా శెట్టి, అభిషేక్‌ బచ్చన్‌తో 'ఫిర్‌ మిలేంగే' హిందీ చిత్రాన్ని రూపొందించారు రేవతి. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 'ముంబై కటింగ్‌' అనే హిందీ చిత్రమూ రేవతి దర్శకత్వంలోనే రూపొందింది. 'కేరళ కేఫ్‌' అనే మళయాళ సినిమాకూ రేవతి దర్శకత్వం వహించారు. అయితే ఇవేవీ 'మిత్ర్‌, మై ఫ్రెండ్‌' లాగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని తమిళ, మళయాళ చిత్రాలకు రేవతి వాయిస్‌ ఓవర్‌ వినిపించారు. 'తిరుప్పావై' అనే వీడియో ఆల్బమ్‌లో నటించడమే కాదు, గాయనిగానూ తన గొంతు సవరించుకున్నారు రేవతి. తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగుతున్న రేవతి ఇటీవల 'ఇట్లు అమ్మ' అనే తెలుగు చిత్రంలో నటించి, మెప్పించారు. ఇదే క్రమంలో ఇప్పుడు దర్శకురాలిగా తన ఐదో చిత్రానికీ రెడీ అవుతోన్నారు. హిందీలో నిర్మితమయ్యే ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక కాజోల్‌ హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి 'ద లాస్ట్‌ హుర్రే' అనే టైటిల్ని కూడా నిర్ణయించారు.
మీ టూ ఉద్యమంలోనూ..
అప్పట్లో మీ టూ ఉద్యమం మంచి ఊపు మీద ఉన్న సమయంలో, ఉద్యమంపై నటుడు మోహన్‌లాల్‌ చేసిన కామెంట్స్‌పై రేవతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 'పేరు పొందిన ఓ నటుడు మీటూ ఉద్యమాన్ని ఫ్యాషన్‌ అంటున్నారు. వీరిలో కొంచమైనా సున్నితత్వాన్ని ఎలా తీసుకురావాలి? అంజలి మీనన్‌ అన్నట్లుగా అంగారక గ్రహంపై నుంచి వచ్చిన వారికి వేధింపుల గురించి తెలిసే అవకాశమే లేదు' అని అన్నారు. అయితే తర్వాత ఆ వ్యాఖ్యల్ని అయన వెనక్కి తీసుకున్నారు.
సామాజిక కార్యక్రమాలు..
సినిమాలకే కాకుండా, రేవతి అనేక రకాల సామాజిక సంస్థల్లో పాల్గొంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్‌, ఎబిలిటీ ఫౌండేషన్‌, ట్యాంకర్‌ ఫౌండేషన్‌, విద్యాసాగర్‌, చెన్నరు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, భారతదేశ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ వంటి అనేక చిత్రోత్సవాల్లో సభ్యురాలిగా కూడా పనిచేశారు.

అసలు పేరు : ఆశా కేలున్ని నాయర్‌
పేరు : రేవతి
పుట్టిన తేదీ : జులై 8, 1966
పుట్టిన ప్రాంతం : కొచ్చి, కేరళ
వృత్తి : నటి, దర్శకురాలు, సామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామి : సురేష్‌ చంద్ర మేనన్‌
పిల్లలు : మహీ
తల్లిదండ్రులు : కేలుని నాయర్‌, లలితే కేలుని