Oct 14,2021 18:50

విజయదశమి పర్వదినం ఈరోజు. మానవ విజయాల వెనక ఉన్న స్త్రీ దేవత శక్తిసామర్థ్యాల గురించి నవరాత్రుల ప్రారంభం నుంచి రకరకాల కథలు చెప్పుకున్నాం. వివిధ రూపాల్లో దేవికి అలంకరణలుచేసి కీర్తనలు పాడాం. ఒకానొక కాలాన సమాజ అభివృద్ధిలో, సంరక్షణలో కీలకపాత్ర పోషించిన మాతృమూర్తికి ఆనవాళ్లు అవన్నీ. మరిప్పుడు ఆ అమ్మకే ప్రతిరూపాల్లాంటి అమ్మలను, అమ్మాయిలను సమాజం అంత ఆదరంగా, గౌరవంగా చూడగలుగుతుందా?
దసరా పండుగ నేపథ్యం గురించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథ వినపడుతుంది. ఏ కథ ఎలా ఉన్నా... శక్తికి మారుగా స్త్రీ దేవతను పూజించడం ముఖ్యమైన ఘట్టం. ఒకనాడు ఘనంగా వర్థిల్లిన మాతృస్వామిక వ్యవస్థకు ఈ పండగ ఒక ప్రతీకగా చరిత్రకారులు చెబుతారు.
సమాజ పరిణామ క్రమంలో మాతృస్వామ్య వ్యవస్థ కీలక భూమిక వహించింది. అందులో స్త్రీలే సర్వశక్తిమంతులు. కుటుంబానికి పెద్దగా, నాయకురాలిగా మహిళ అగ్రపథంలో నడిచింది. కీలక సందర్భాల్లోనూ, సంక్లిష్ట సమయాల్లో తమ సమాహాలను కాపాడుకోవటానికి ముందుండి పోరాడింది. ఎంతో గొప్పగా శక్తియుక్తులను ప్రదర్శించింది. అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. తమ రక్షక దేవతలుగా అప్పటి వరకూ గౌరవం పొందిన చెట్టు, చేమ, గాలీ వానా, అగ్ని నీరూ వంటి వాటి సరసన స్త్రీ అనే సజీవ మూర్తిని కూడా చేర్చుకొంది ఆనాటి సమాజం. ఆమెలో దాగున్న అపార ధైర్యసాహసాలకు అచ్చెరువొంది శక్తికి ప్రతిగా ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు.
ఇప్పటికీ గ్రామాల్లో ఈ సంస్కృతి కనబడుతుంది. గ్రామ దేవతలుగా ఇలవేల్పులుగా స్త్రీ దేవతలనే పూజిస్తుంటారు. పితృస్వామిక వ్యవస్థ బాగా బలపడినా ఒకప్పటి ఆరాధనా రూపం అలాగే కొనసాగింది. అయితే లింగ సమానత్వాన్ని అంత తేలికగా ఆమోదించని పితృస్వామ్య వ్యవస్థలో నేడు మనం ఉన్నాం.

ఆమె నిత్య శక్తి స్వరూపిణి ..!
శక్తిస్వరూపిణిగా...
అన్యాయాన్ని ఎదిరించి పోరాడే శక్తిగా మహిళను అభివర్ణించడం ఈ నవరాత్రుల్లో మనకు కనబడుతుంది. కథల్లో చెప్పినట్లుగా రాక్షసులను అంతమొందించడంలో ఆమె ప్రదర్శించిన ధీరత్వాన్ని వేన్నోళ్ల కొనియాడతారు. వాస్తవంలో మాత్రం ఆ భావన కొరవడుతోంది. మహిళను అబలగా వర్ణిస్తూ, ఇంటికే పరిమితం చేయాలని కొందరు, అన్యాయాన్ని ఎదిరించిన మహిళలపై దాడులు చేయమని మరికొందరు వారిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నో ఉదంతాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. ఆధునిక మహిళ ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతుందని, పిల్లలను కనడానికి ఇష్టపడదని ఇటీవలే కర్నాటక మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల సమాజ ధోరణికి ప్రతిబింబాలు. కానీ, మహిళల శక్తి సామర్ధ్యాలూ, ఆధునిక ప్రతిభాపాటవాలూ ఎప్పటికప్పుడు గణుతికెక్కుతూనే ఉన్నాయి. రైతులుగా, ఉద్యోగులుగా, వ్యాపారులుగా అగ్రశ్రేణిలో రాణిస్తున్న ఎంతోమంది మహిళలు నేడు శక్తి స్వరూపులుగా కనిపిస్తారు. విద్యావంతులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించే యువతులు నేటి సమాజ కరదీపికలు. కుటుంబ బరువు బాధ్యతల్లో తలమునకలౌతున్నా... తాము ఎంచుకున్న రంగంలో విజయపథాన దూసుకుపోతున్న ఈ మహిళలంతా శక్తిస్వరూపిణులే.
విద్యాదేవతలుగా...
విద్యకు ప్రతిగా స్త్రీ రూపాన్ని కొలవడం కూడా ఈ దసరా సందర్భంగా చూస్తాం. కాని విద్యా, ఉపాధిలో ఆమెకు సముచిత స్థానం ఇవ్వడానికి ఇష్టపడని సమాజం ఇది. విద్యావంతురాలిగానే కాదు, కార్మికురాలిగా, ఉద్యోగినిగా, అధికారిగా ఏ స్థాయిలో ఉన్నా సరే ఆమెకు లభించే గౌరవం అరకొరే. స్త్రీల ఎదుగుదలను ఆశించని భావజాలం నడుమ జీవిస్తోంది నేటి మహిళ. అందుకే సదరు కర్నాటక మంత్రి ఆధునిక మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రతిగా అంతంత మాత్రమే స్పందన వచ్చింది. ఒకపక్క దేవతగా కొలుస్తారు.. మరోపక్క ఆమె ఉన్నతిని ఆకాంక్షించరు... ఇటువంటి భిన్న సమాజంలో మనం ఉన్నాం.

ఆమె నిత్య శక్తి స్వరూపిణి ..!
సంపదకు మారు పరుగా...
మహాలక్ష్మి అవతారంగా స్త్రీ రూపాన్ని పూజించడం దసరా నవరాత్రుల్లో కీలకంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధిలో స్త్రీ పాత్ర ఔన్నత్యానికి నిదర్శనంగా ఆ రోజున కొలుస్తారు. కాని సమాజ ఆచరణలో ఎక్కువ సందర్భాల్లో ఆమె ఆర్థిక వనరే గాని, ఆర్థిక భాగస్వామి కాదు. మహిళలు ఏ రంగంలో రాణిస్తున్నా వారికుండే ఆర్థిక స్వేచ్ఛ అంతంతమాత్రమే! మహిళలు ఆర్థికంగా రాణిస్తే సామాజికంగా ఆమె ఉన్నత స్థానంలోకి ఎగబాకుతుందనేది వాస్తవం. కాని ఆ వాస్తవాన్ని స్వీకరించని సమాజం ఇది.
బిడ్డలను కనడం, పెంచి పోషించడం, భర్త ఆలనాపాలనా చూసుకోవడం, కుటుంబ సంరక్షణ బాధ్యతలకే పరిమితమైన మహిళలు ఎప్పటినుంచో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అదే సందర్భంలో వారిపై దాడులు, హింస, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. విద్య, ఉపాధిలో నేటికీ ఆమెకు సముచిత స్థానం లేదు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషను కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. కరోనా వచ్చి మహిళల పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. వారిలో బాలికలే అధిక సంఖ్యలో ఉండడం దురదృష్టకరం. బాల్య వివాహాల పేరుతో వారి అభివృద్ధి అణచివేయబడుతోంది. లాక్‌డౌన్‌ కాలంలో మహిళలపై హింస పెరిగిపోవడానికి కారణం అనాదిగా స్త్రీల పట్ల నెలకొన్న చులకన భావనే. అందుకే ప్రతిమలు చేసి, పందిర్లు వేసి ఆమెను పూజించక్కర్లేదు... శక్తిమంతురాలిగా కీర్తించి, దణ్ణం పెట్టి దండలు వేయక్కర్లేదు. ఆమెను గౌరవించి, సమున్నతంగా నిలబడే వాతావరణం కల్పించాలి. ఆమె ప్రతి రోజూ శ్రమశక్తి స్వరూపిణియే .. తోటి మనిషిగా గుర్తించి సమాదరిస్తే... అదే గొప్ప పండగ. అదే గొప్ప సమ, శ్రమ సాంస్కృతిక వేడుక.