Sep 24,2020 18:32

గతేడాది శీతాకాలపు రోజులు. దేశ రాజధాని ఢిల్లీలో గడ్డకట్టే చలిలో జనాలు ఎవరూ బయటకు రావడం లేదు. ఆ సమయంలో ఒక గుడారం కింద వందమందికి పైగా మహిళలు కూర్చొని ఉన్నారు. వారంతా సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ పోగయి నిరసన తెలియజేస్తున్నారు. ఆ బృందంలో భుజం నిండుగా శాలువా కప్పుకొని ఓ 82 ఏళ్ల ముదుసలి కూడా ఉన్నారు. ప్రశాంతమైన చిరునవ్వుతో కూర్చొని ఉన్న ఆమె పేరు బుల్కీ. ఆమె ఆ పోరాటానికి ఎంతో ఉత్తేజం కలిగించింది. ఇప్పుడు 'బుల్కీ' దాదీని టైమ్స్‌ మాగజైన్‌-2020 ప్రపంచంలోని వందమంది ప్రభావశీలుర జాబితాలో చేర్చింది.
ఆ పురస్కారానికి ఆమె తగినవారే. ఎందుకంటే ఆమె పోరాటం చేసింది తన కోసం కాదు. దేశంలో పౌరసత్వ నమోదు వల్ల నష్టపోయే కోట్లాదిమంది భారతీయుల కోసం. వయసు వల్ల ఎదురయ్యే ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా పోరాటానికి తెగబడింది బుల్కీ దాదీ. బుల్కీతో పాటు అక్కడకు చేరారు మరి కొంతమంది వృద్ధమహిళలు. ఒకటీ, రెండు రోజులు కాదు, ఏకంగా 101 రోజులు నిరసన సాగించారు. ఆ గుడారమే కరోనాకు ముందు దేశవ్యాప్తంగా జరిగిన అనేక నిరసనలకు ప్రభావం చూపిన షాహిన్‌బాగ్‌. అక్కడ చేరిన వృద్ధ మహిళలంతా ఆ తరువాతి కాలంలో 'షాహిన్‌బాగ్‌ దాదీస్‌'గా గుర్తింపు పొందారు. 'బిల్కీ అట్టడుగు వారి స్వరమయ్యారు. మోడీ పాలనలో మెజార్టీ రాజకీయాల వల్ల దేశంలో అణచివేయబడుతున్న మహిళలు, మైనార్టీల ప్రతిఘటనలకు చిహ్నంగా ఉన్నారు' అంటూ జర్నలిస్టు, రచయిత రానా అయుబ్‌ ఒక సందర్భంలో ఆమె ధీరత్వం గురించి ప్రస్తావించారు.
'మేము ముసలివాళ్లం. ఈ వయసులో ఇంత చలిలో నడిరోడ్డు మీద చేస్తున్న ఈ పోరాటం మా కోసం కాదు... మా పిల్లల్లాంటి ఎంతోమంది కోసం...' అంటారు బుల్కీ. జనవరి 26న రిపబ్లిక్‌డే వేడుకల సందర్భంగా వందలాది మహిళలంతా కలసి జాతీయ జెండాను ఎగురవేశారు. వారిలో రోహిత్‌ వేముల, జునైద్‌ఖాన్‌ తల్లులతో పాటు బిల్కీ కూడా ఉన్నారు. తమ పాటలు, పద్యాలు, స్లోగన్‌లతో అక్కడ కూర్చొన్న సమూహాన్ని ఉత్సాహపరిచారు.
ఫిబ్రవరి నాటికి షాహిన్‌బాగ్‌ నిరసనల వేడి ఉధృతమైంది. దీంతో ప్రభుత్వం వీరిని చెదరగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అప్పుడే వేదికకు 50 మీటర్ల దూరంలో సాయుధ బలగాల సిబ్బంది ఒకరు రెండు బుల్లెట్లను పేల్చారు. అవి బుల్కీ కూర్చొన్న ప్రదేశానికి అతి సమీపంలోనే పడ్డాయి. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. ఆ సంఘటనతో గుడారం లోపల ఉన్న మహిళలంతా ఒక్కసారిగా భయంభ్రాంతులకు గురయ్యారు. అయినా వెంటనే తేరుకొని ఆ బుల్లెట్లను వెతకడంలో నిమగమయ్యారు. 'బుల్లెట్లు మమ్మల్ని భయపెట్టలేవు' అంటూ ఆ సందర్భంలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుల్కీ చెప్పడం అక్కడ ఉన్న ఎంతోమంది మహిళలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.
బుల్కీతో పాటు షాహిన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గన్న ముగ్గురు వృద్ధమహిళలు ఎంతో సమర్థవంతమైన, శక్తినిచ్చే పోరాటం చేశారు. ఉదయం 8 గంటలకు నిరసనలో పాల్గనే బుల్కీ మళ్లీ అర్ధరాత్రికి కొద్ది సమయం ముందు మాత్రమే విరామం తీసుకునేవారు. అలా సుమారు నాలుగు నెలల పాటు వారంతా పగలు రాత్రి అక్కడే గడిపారు. అలా ఆ బృందంలో వారి వల్ల ప్రభావితమైన హీనా అహ్మద్‌ 'బుల్కీకి ఈ పురస్కారం రావడం ఎంతో సంతోషంగా ఉంది. మా ఉద్దేశాలకు ఇప్పుడు ఎవరో ఒకరి మద్దతు దొరికినట్లైంది. కొంతమంది అధికారులు మేము చేస్తున్న ఈ నిరసనను చట్టబద్ధత కాదని మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాని ప్రధాని మోడీతో పాటు బుల్కీ దాదీ పేరు కూడా ఈ జాబితాలో ఉండడం మా పోరాటానికి చట్టబద్ధత కల్పించినట్లుగా ఉంది. నిరసనలో పాల్గన్న వందలాది మహిళలకు గుర్తింపు దక్కినట్లే' అన్నారామె.
గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు నియమించిన పెద్దమనుషుల బృందం బుల్కీ బృందాన్ని కలిసింది. ఆమెతో పాటు ఆమె మరో ఇద్దరు స్నేహితురాళ్లు కూడా వారితో మాట్లాడారు. అప్పుడు వారంతా ఏకకంఠంతో.. పౌరసత్వ చట్ట సవరణపై మాట్లాడేందుకు ప్రభుత్వ పెద్దలు రావాలని డిమాండ్‌ చేశారు.
ఇప్పుడు రోడ్డు నెంబరు 13 ఖాళీగానే ఉంది. రోడ్లమీద, గోడల మీద రాసిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు తుడిచివేయబడ్డాయి. దుకాణాలన్నీ యథావిధిగా తెరచుకున్నాయి. కానీ అక్కడ పోలీసు పహారా మాత్రం చాలా కట్టుదిట్టం చేశారు. పారా మిలటరీ బృందం ఇప్పటికీ అక్కడ గస్తీ కాస్తోంది. మళ్లీ ఎవరూ ఆ రోడ్డు మీద బైఠాయించకుండా ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అంతమంది పోలీసు బలగాలకు కంటిమీద కునుకులేకుండా చేసింది బుల్కీ నేతృత్వంలోని షాహిన్‌బాగ్‌ పోరాటం. ఎంతోమంది... మరెంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పోరాటానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు బుల్కీ దాదీ. ఆమె నిరసన శిబిరం ఇప్పుడు ఎత్తివేసి ఉండొచ్చు.. ఆమె స్ఫూర్తి మాత్రం లక్షలాది గుండెల్లో ప్రశ్నను, చైతన్యాన్ని రగిలిస్తూనే ఉంది. టైమ్స్‌ ప్రత్యేక గుర్తింపు దీనికి మరింత ఉత్తేజాన్ని కలిగిస్తోంది!