Apr 06,2021 19:45

పెళ్లి ద్వారా ఒక్కటైన నేటితరం కొన్ని నెలలకే ఒకరినొకరు అర్థం చేసుకోక, సర్దుకుపోలేక విడాకులవైపే మొగ్గుచూపుతున్నారు. అసలు వివాహ బంధ మాధుర్యాన్ని కూడా చూడలేకపోతున్నారు. అటువంటివారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది. ఆమె వయసు 90, ఆయన వయసు 101, వీరిద్దరికీ పెళ్లయి 72 సంవత్సరాలు. అన్యోన్యదాంపత్యమెలా ఉంటుందో వీరిని చూస్తే అర్థమౌతుంది. ఇంకో విషయండోరు వీరిద్దరూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి కొన్ని సలహాలను కూడా ఇచ్చారు. రోజులో ఒక్కసారైనా ఇద్దరూ కలిసి భోజనం చేయాలి. కొన్ని సందర్భాల్లో కోపంలో మాట తూలకుండా, అసలు మాటలే వినిపించుకోకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మూగ, చెవిటిగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవని సింపుల్‌గా చెప్పేశారు. ఇక ఏదైనా సరే.. ఏ విషయంలోనైనా సరే బాధపెట్టినట్లయితే.. ముందుగా క్షమించమని అడగడం వల్ల వారిమధ్య బంధం బలపడుతుందని అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఒకరినొకరు వదిలిపెట్టకుండా.. చేతులు పట్టుకుని నడవడం. ఇటువంటి పాటిస్తే.. వివాహబంధం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందట. ఈ వయసులో కూడా.. ఒకరిపై ఒకరు ప్రేమ ఏమాత్రం తగ్గకుండా.. ఎలా ఉంటుందన్నిదీ ఓ వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే పేరిట పోస్ట్‌ చేశారు. ఈ వీడియో బాలీవుడ్‌ చిత్రం 'బార్ఫీలోని 'ఇట్ని సి హసీ, ఇట్ని సి ఖుషీ' పాట బ్యాక్‌డ్రాప్‌తో మొదలవుతుంది. రోజువారీ కార్యకలాపాల్లో ఒకరినొకరు సహకరించుకోవడం, సమయాన్ని పంచుకోవడం చూస్తుంటే వారెంత సంతోషంగా ఉన్నదీ తెలుస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 3.87 లక్షల కుపైగానే లైక్‌ చేశారు. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ఆ జంటను మెచ్చుకుంటున్నారు. ఓ నెటిజన్‌ అయితే.. 'డాడి చేయి అందించడం, సహాయం చేయడం.. ఎంతో బాగుంది. ఇటువంటివి చేసే వ్యక్తి మనకు ఒకరు ఉండాలి. ఎనీవే.. వారిద్దరికీ నా శుభాకాంక్షలు అని అన్నారు. ఇంకొక నెటిజన్‌.. ఇది నా హృదయాన్ని కరిగించింది. అని వ్యాఖ్యానించారు.