May 30,2021 14:36

తూర్పు అమెరికాలో ఇప్పుడు చాలా చోట్ల ఎరుపు రంగు కళ్లు ఉన్న సికాడాలు కనిపిస్తున్నాయి. వీటిని చూడగానే అమెరికన్లు ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే.. ఇవి 17 ఏళ్ల తర్వాత మళ్లీ భూమి పొరల్లోంచి పైకి వచ్చాయి. ఇన్నేళ్లూ అవి భూమి లోపలే ఉండిపోయాయి. మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయనే ప్రశ్నకు సమాధానం లేదు. కానీ.. త్వరలోనే మళ్లీ ఇవి భూమిలోకి వెళ్లిపోతాయనీ.. మళ్లీ 2038లో భూమిపైకి వస్తాయనీ పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.

   భూమిపై వారం రోజులు మాత్రమే జీవితకాలం కలిగిన ఈ సికాడాస్‌ భూగర్భంలో మాత్రమే 13 నుంచి 17 సంవత్సరాల అసాధారణ జీవిత చక్రం కలిగి ఉంటాయి. అయితే వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు కారణంగానే ఇవి భూమిపైకి వచ్చాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ సికాడాల్లో మొత్తం 3,000 జాతులు ఉన్నాయి. ఇవి అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో కనిపిస్తాయి. వీటి గుడ్లు ఆకులు, బెరడులో పొదిగినప్పుడు పురుగు అపరిపక్వ రూపంలో ఉంటుంది. భూమిపైకి వచ్చిన తర్వాత రెక్కలు మొలుస్తాయి. ఇవి ముందుకాళ్లతో బొరియలు చేస్తాయి. వీటిపై అధ్యయనం చేసిన అనంతరం ఇవి భూమికి రెండుమీటర్ల కన్నా తక్కువ లోతులో నివసిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. వీటి శాస్త్రీయ నామం ''సికాడోయిడియా''.
    ఈ పురుగుల్ని ''బ్రూడ్‌ ఎక్స్‌'' లేదా ''బ్రూడ్‌ 10'' అని పిలుస్తారు. ఇవి మెల్లగా భూమిని చీల్చుకుంటూ.. చెట్లు, మొక్కలపై పాకుతూ పైకి వెళ్తాయి. ఇళ్ల గోడలపై ఇవి కనిపిస్తున్నాయి. గొంగళి పురుగులు ఎలాగైతే సీతాకోక చిలుకలు అవుతాయో.. భూమిపైకి వచ్చాక.. ఈ పురుగులకు కూడా రెక్కలు వస్తాయి. దాంతో.. ఇవి తమ పాత శరీరాన్ని వదిలేసి.. రెక్కలతో కొత్త శరీరాన్ని సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎగురుతాయి. ఈలోపే అమెరికన్లు ఈ పురుగుల్ని పట్టేసుకొని.. ఇళ్లకు తీసుకెళ్లి, వండేసుకుంటున్నారట.

అమెరికాలో 17 ఏళ్ల తర్వాత భూమిపైకి సికాడాలు !


   మన దేశంలో రొయ్యలు ఎలా రుచికరంగా ఉంటాయో.. ఈ పురుగులు కూడా అమెరికాలో అలాంటి రుచితోనే ఉంటాయట. అందువల్ల కెంటకీలోని లూయిస్‌విల్లేలో ఈ పురుగుల్ని వండేస్తున్నారు. రెస్టారెంట్లలో ఇవి స్పెషల్‌ ట్రీట్‌ అయిపోతున్నాయి. జనం ఎగబడి వీటిని తింటున్నారు. మళ్లీ జీవితంలో ఇలాంటి రుచి దొరకదు అని అనుకుంటున్నారట ఆహార ప్రియులు.
   ఇలా వీటిని ప్రజలు తినేస్తే.. ఇక వీటి జాతి అంతరించిపోతుందేమో అనుకోకండి. ఎందుకంటే.. అమెరికా భూమిలో ఇవి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయట! ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. అందుకే ప్రజలు తెగ సంబరపడుతున్నారు. మరికొన్ని వారాల్లో తూర్పు అమెరికాలో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయట. ఒకవేళ అమెరికన్లు వీటిని చంపకపోయినా.. ఒక్కో పురుగూ దాదాపు నాలుగు వారాలే బతుకుతుందట.
   ఇన్నాళ్లూ భూమిలో ఉన్న ఈ పురుగులు ఇప్పుడు బయటకు రావడానికి కాలుష్యం తగ్గడమే కారణం అనే వాదన వినిపిస్తోంది. కరోనా వల్ల కాలుష్యం తగ్గడంతో.. ఇవి బయటకు వచ్చాయంటున్నారు శాస్త్రవేత్తలు. కారణం ఏమైతేనేం.. వర్జీనియా మార్కెట్లలో ఇప్పుడు ఇవే హాట్‌ కేకులు.. ప్రజలు ఆనందంగా వీటిని తింటున్నారు.