May 16,2022 12:31

వాషింగ్టన్‌ :  అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూయార్క్‌లోని బఫెలో సూపర్‌ మార్కెట్‌లో పద్దెనిమిదేళ్ల దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. తుపాకీ కాల్పుల్లో మొత్తం 13 మంది బాధితుల్లో 11 మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు ఉన్నట్లు బఫెలో పోలీస్‌ కమిషనర్‌ జోసెఫ్‌ గ్రామగ్లియా తెలిపారు. ఈ ఘటన మరువక ముందే ఆదివారం రాత్రి రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. లాస్‌ ఏంజెల్స్‌ సమీపంలోని చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థల అనంతరం ఒక దుండగుడు కాల్పులు జరపడంతో ఒకరు మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆసియాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. టెక్సాస్‌లోని హారిస్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం ఫ్లీ మార్కెట్‌లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వివాదం కాల్పులకు దారితీసిందని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.