Sep 25,2021 08:55

వాషింగ్టన్‌: అమెరికాలో వయో వృద్ధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్న వారికి బూస్టర్‌ డోసు అందించనున్నారు. ఈ మేరకు అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల (సిడిసి) విభాగం ఆమోదం తెలిపింది. సలహాదారుల కమిటీ చేసిన సిఫార్సులకు సిడిసి డైరెక్టర్‌ డా. రాషెల్‌ వాలెన్‌స్కీ గురువారం రాత్రి ఆమోదం తెలిపారు. ఫైజర్‌ రెండో టీకా డోసు తీసుకుని కనీసం 6 నెలలు పూర్తయిన వారికే ఈ బూస్టర్‌ డోసు ఇవ్వాలని, 65 ఏళ్లు, ఆ పై వయసున్న సీనియర్‌ సిటిజన్లకు, నర్సింగ్‌ హోంలలో చికిత్స పొందుతున్నవారికి, 50 ఏళ్లు దాటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి దీన్ని అందించాలని కమిటీ ప్రతిపాదించింది. దీనికి అదనంగా రాషెల్‌ వాలెన్‌స్కీ మరో సూచన కూడా జత చేశారు. కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్న ఖైదీలు, షెల్టర్‌ హోంలలో ఉండే నిరాశ్రయులు, ఆరోగ్య కార్యకర్తలకు సైతం బూస్టర్‌ డోస్‌ ఇచ్చేలా సిఫార్సులు సవరించారు. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 182 మిలియన్‌ మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అంటే దేశ జనాభాలో 55 శాతం మాత్రమే. బ్రిటన్‌, ఇజ్రాయిల్‌ ఇప్పటికే తమ తమ దేశాల్లో ప్రజలకు మూడో ప్రయత్నంగా బూస్టర్‌ డోసు ఇస్తున్నాయి. ఈ వైఖరి వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న పేద దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది.