May 23,2021 13:00

''ల్లీ, పొద్దున్నించి ఫోన్‌ చెయ్యలేదురా నాన్నా? ఆరోగ్యం బాగానే ఉందా?'' అంటూ హాస్టల్లో ఉన్న కూతురుకి ఫోన్‌ చేసింది భువన.
''అమ్మా, ఏటయ్యింది? నిన్నరాత్రికి ఇప్పటికీ నాకేమీ కాదు. నేనేమీ అయిపోను. రోజుకి రెండు సార్లు ఫోన్‌ చేసి, ఏం తిన్నావు? ఫుడ్‌ బాగుందా, లేదా? ఏంటి వండేరు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను విసిగించి చంపుతావు'' అంటూ విసుగ్గా ఫోన్‌ పెట్టేసింది వల్లి.
బాధగా నిట్టూర్చింది భువన. 'ఈపిల్ల కూడా వాళ్ళ నాన్న లాగానే తయారయింది. తను పెంపకంలో లోపం చెయ్యలేదు. తను చేసిన తప్పేంటి? పెద్దగా చదువుకోలేదని తెలిసి కూడా తనను పెళ్లి చేసుకున్న భర్త, చదువులేని మొద్దు అని చులకనగా మాటలాడుతూంటే...పోనీలే అని తలదించుకునేది భువన. తండ్రి మాటల ప్రభావం కూతురుమీద పడి, కూతురుకూడా తల్లిని చులకనగా మాట్లాడుతుంటే, అప్పుడప్పుడూ మనసు కష్టపడుతోంది భువనకు.
తండ్రి తెలివితేటలు పుణికి పుచ్చుకొని, స్టేట్‌ లెవెల్లో మెరిట్‌గా ఉన్న కూతురంటే ప్రాణం భువనకు. కూతురుకి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందని తోబుట్టువులతోపాటు చుట్టాలందరూ అభినందిస్తుంటే తల్లిగా సంతోషంతో పొంగిపోయింది. తను కూడా కూతురుని దగ్గరకు తీసుకొని అభిమానం వ్యక్తం చేయాలని అనుకొంది. కానీ కూతురు ఏదో అవసరానికే తప్ప తనతో మాట్లాడదు అని ఎన్నోసార్లు బాధ పడింది ఆ తల్లి మనసు.
పేపర్‌ వాళ్ళు, టీవీల వాళ్లు కూతురు ఇంటర్వ్యూ తీసుకోవటానికి వచ్చారు. భువన ఆ సంతోషంలో స్వయంగా చేసిన గులాబ్‌ జామ్‌ వాళ్లకు ఇచ్చినప్పుడు, కూతురు అందరిముందూ...''అమ్మా, నువ్వు ఇంట్లో చేసినవి ఎందుకు పెడుతున్నావు? నువ్వు చేసేవి గులాబ్‌ జామ్‌ల్లా ఉండవు. గుండ్రాళ్ళల్లా ఉంటాయి. స్వీట్స్‌ బయటనుంచి తెప్పించవలసింది కదా'' అంటూ విసుక్కుంటే... బాధపడినా సర్దుకుంది భువన. విలేఖరులు కూతురుని ప్రశంసిస్తూ ఇంటర్వ్యూ తీసుకుంటుంటే... చాకచక్యంగా సమాధానాలు ఇస్తున్న కూతురుని వంట గదిలోనుంచి తొంగి చూస్తూ మురిసిపోయింది.
''మీ ఆశయ సాధనలో మీ అమ్మగారి పాత్ర ఎంత?'' అని టీవీ వాళ్ళు అడిగినప్పుడు, భువన చెవులు రిక్కించింది, కూతురు ఏం చెప్తుందో వినాలని. అంతలో వల్లి పకపకా నవ్వుతూ... ''ఇందులో మా అమ్మ రోల్‌ ఏమీ లేదు. మా నాన్నగారి ప్రోత్సాహంతోనే నేను బాగా చదవగలిగాను. నాన్నగారు డ్యూటీ నుంచీ రావటం ఆలస్యమైనా సరే, నా చదువు కోసం అతని నిద్ర మానుకొని, నాతోపాటు కూర్చొని మరీ చదివించేవారు. నేను మంచి మార్కులు తెచ్చుకోవటంలో నా పాత్ర ఎంతుందో, మానాన్నగారి పాత్ర కూడా అంతే ఉంది'' అని కూతురు అన్నపుడు భువన మనసు బాధపడింది. ఇంటర్వ్యూ అయినత రువాత..''ఏమ్మా, నా గురించి కొంచమైనా, మంచిగా టీవీ వాళ్లకు చెప్పచ్చు కదే'' అంది భువన కినుకగా కూతురుతో.
''ఏంటి చెప్పేది? నాకోసం నువ్వేం చేశావని చెప్పమంటావు అమ్మా?'' అంది ఎగతాళిగా వల్లి.
''నీకు అనుక్షణం బలమైన ఆహారం ఇస్తూ, నువ్వు చదువుతున్నంత సేపూ నీకు నీళ్ళు, పాలు అందిస్తూ, నీ గురించి ఆలోచిస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుjyలేదా నేను?'' అంది భువన. ''సరేలే, నీ సోది ఆపు. అందరు అమ్మలూ పిల్లల్ని అలాగే చూస్తారులే. ప్రపంచంలో నువ్వొక్కర్తివే ఏదో చేస్తున్నట్టు చెప్తున్నావు. అయినా ఏంటి చెప్పమంటావు నీగురించి? నువ్వేమైనా పెద్ద ఉద్యోగస్తురాలివా? లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు ఏమైనా ఉన్నాయా?'' అంది చిరాగ్గా వల్లి.
వల్లికన్నా రెండేళ్లు చిన్నవాడైన వినరు తల్లిని అర్థం చేసుకొని, తల్లి బాధ పడుతుందని అక్కకు నచ్చచెప్పబోతే...''పోరా అమ్మకూచీ. నువ్వు నాకు చెప్పేసశీంటి? నువ్వు కూడా అమ్మలాగే మందబుదిష్ట్రణ గాడివి'' అంటూ తమ్ముడిని గేలి చేసేది.
కూతురు ఎంత విసుక్కున్నా సరే, పై చదువులకోసం హాస్టల్‌కి వెళుతున్న కూతురుకి, చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్తూనే ఉంది భువన.

                                                                              ***

   ఎప్పుడూ చదువులో మునిగి ఉండే వల్లి, పై చదువుకోసం కాలేజీలో అడుగు పెట్టింది. విశాలమైన భవనాలు, తూనీగల్లాంటి విద్యార్థులతో అదొక వింతైన రంగుల ప్రపంచమనిపించింది. కొత్త స్నేహాలతో పాటు టాప్‌ ర్యాంకర్‌ అనే గౌరవంతో పట్టలేని సంతోషాన్ని ఇచ్చింది కాలేజీ వాతావరణం వల్లికి.
ట్వల్త్‌ దాకా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో కష్టపడి మంచి ర్యాంక్‌ తెచ్చుకుంది. కాలేజీలో మాత్రం చదువుతున్నారో, లేదో ఎవరూ పట్టించుకోరు. రెక్కలొచ్చిన పక్షుల్లా ఉన్న వాళ్ళని చూసి తనను తాను మర్చిపోయి, అందరితో పాటూ పుస్తకాలు పక్కకు పెట్టి రంగుల ఊహల్లో తేలిపోసాగింది. సీనియర్స్‌ ఆటపట్టింపులు, మగపిల్లలు తన అందాన్ని ఆరాధిస్తూ కామెంట్స్‌, ఆడపిల్లల అసూయ చూపులు, ఇవేకాక కొత్తగా చేతికి వచ్చిన స్మార్ట్‌ ఫోన్‌లో సమయం గడపటంతో తనను తాను మర్చిపోయింది వల్లి.
మొదటి సెమిస్టర్‌ రెండు సబ్జెక్ట్స్‌ ఉండిపోయాయి. ఇంట్లో చెప్పలేదు. రెండో సెమిస్టర్‌లో ముందువి రెండు, కొత్తగా మరో రెండు సబ్జెక్ట్స్‌ బ్యాక్‌ అయ్యేసరికి, భయంవేసి జాగ్రత్తపడి, నెక్స్ట్‌ ఇయర్‌ నుంచీ అన్నీ క్లియర్‌ చేసుకుంది. థర్డ్‌ ఇయర్‌కి వచ్చేసరికి తెలిసింది ఏంటంటే... నాలుగు సంవత్సరాల్లో ఒక్క బ్యాక్‌లాగ్‌ ఉన్నా సరే, ఆ కాలేజీ రూల్‌ ప్రకారం క్యాంపస్‌ సెలెక్షన్‌లో కూర్చో నివ్వరని. ఈ సంగతి తెలిసి భయపడింది.
కొండమీద నుంచి అగాధంలో పడినట్టుగా ఉంది వల్లికి. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆశల సౌథం కూలిపోయినట్టు విలపించింది. చదువుని ఎందుకు నిర్లక్ష్యం చేశాను? అని ఎన్నో సార్లు తనని తాను ప్రశ్నించకుంది. ఎంత అలసటగా ఉన్నా, రాత్రి పన్నెండు దాకా తనతోపాటు కూర్చొని చదివించిన తండ్రి గుర్తు వచ్చి కళ్ల వెంట నీళ్ళు కారాయి వల్లికి.
థర్డ్‌ ఇయర్‌ ఎగ్జామ్‌ రాసి సెలవులకి ఇంటికి వచ్చింది. ఇంట్లో సంతోషంగా గడపలేకపోతోంది. పలకరించటానికి వచ్చిన బంధువులు స్నేహితులు తండ్రితో... ''ఇంకేంటి, మీ అమ్మాయి చదువు పూర్తి అయిపోతోంది. ఇంక క్యాంపస్‌లో ఉద్యోగం రావటం ఖాయం'' అంటూ అభినందిస్తుంటే... తండ్రి సంతోషంతో పొంగిపోవటం చూసి బెంగగా వుండేది.
అన్నం దగ్గర కూర్చుంటే, తినబుద్ధి వేసేది కాదు. మౌనంగా కళాకాంతి లేకుండా ఉన్న కూతురుని చూస్తుంటే భువనకు అనుమానం పరి పరి విధాలుగా పోయేది. 'ప్రతి చిన్న మాటకూ తనని విసుక్కుంటూ, ఎగతాళిగా మాట్లాడే కూతురు ఎందుకు మౌనంగా ఉంటోందో?' ముందు భువననే అడుగుదామనుకుంది. మళ్లీ వద్దులే అనుకొని, మంచి హోదాలో ఉన్న తమ్ముడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది భువన.
ఎప్పుడో కానీ ఫోన్‌ చెయ్యని అక్క వద్ద నించీ ఫోన్‌ రావటంతో... ముందు భయపడి విషయం విని, ''కంగారు పడకు. నేను కనుక్కుంటాను. ధైర్యంగా ఉండు'' అని అక్కకు ధైర్యం చెప్పి, వల్లి గురించి కాలేజీలో ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటంటే... 'వల్లి చాలా మంచి స్టూడెంట్‌. కాలేజ్‌లో మంచి పేరుంది. అయితే మొదటి రెండు సెమిస్టర్‌ల్లో కొన్ని బ్యాక్‌లాగ్స్‌ ఉండటం వల్ల, వల్లిని కాంపస్‌ సెలెక్షన్‌లో కూర్చోనియ్యరని తెలిసింది'. అక్కకు ఈ విషయం చెప్పి...
''ఇదే కారణంతో వల్లి బాధపడుతూ ఉంటుంది. నువ్వూ, బావగారు ఏమీ అనకండి'' అని చెప్పాడు భువన తమ్ముడు, అక్కకి. 'పోనీలే, ఇంకేదో ప్రేమ వ్యవహారంలో పడిందేమో? జరగరానిది ఏమైనా జరిగిందేమో అని భయపడ్డాను' అని నిట్టూర్చింది భువన.
భర్తకు మెల్లిగా కూతురు విషయం చెప్పింది భువన. భార్య మాటలు విని గట్టిగా... ''ఎందుకు సరిగా చదవలేదు నీ కూతురు. ఇంటి నుంచీ దూరంగా వెళ్ళగానే, దాని పట్టుదల ఏమయ్యింది? గోల్డ్‌ మెడల్‌ తెస్తుందని ఆశపడుతుంటే... ఛీ, అసలు అందరూ నీ కూతురుకి కాంపస్‌ సెలెక్షన్‌ అవలేదా? అంటే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి'' అంటూ అరుస్తున్న భర్తతో... ''అందరి విషయంలోనూ పొరపాట్లు జరుగుతాయండీ. కానీ మనం పిల్లని తిట్టి, బాధపెడితే ఏం వస్తుంది? అది చెయ్యకూడని పొరపాటేమీ చెయ్యలేదు కదా. ఏదో చిన్నతనం ఇంటినుంచీ మొదటిసారి బయటకు వెళ్ళటం. కాలేజ్‌ అలవాటు అయ్యేసరికి సమయం పట్టింది పిల్లకు'' అంటూ నచ్చచెప్పింది.
''ఏది, ఎక్కడీ పిలువు'' అంటున్న భర్తతో... ''ష్‌.. మెల్లిగా. పిల్ల వింటే ఏడుస్తుంది. మీరు కోపాన్ని తగ్గించుకోండి. మన అమ్మాయికి చదువు పూర్తి కాగానే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది. ఊరికే మీరు బాధపడి, దాన్ని బాధపెట్టకండి'' అని భువన నచ్చచెప్తూ ఉంటే...
తలుపు వెనుక నిలబడి తల్లితండ్రుల మాటలు విన్న వల్లి 'అయ్యో, తెలియక చేసిన పొరపాటుతో నాన్నను బాధ పెట్టేను అనుకొంది. నాన్నకు ఎంతో బాధ్యతగా నచ్చచెప్తున్న ఆమ్మని కొత్త కోణంలోంచీ ఆశ్చర్యంగా ఆరాధనగా చూస్తూ... అమ్మని ఎన్నోసార్లు చదువు లేనిదానివని కించపరిచాను. ఎగతాళిగా మాట్లాడాను. నా తిరస్కారానికి అమ్మ ఎన్ని సార్లు బాధపడిందో? అయినా అమ్మ నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. ఇప్పుడు నేను బాధపడుతున్నానని ఎంతో తల్లడిల్లిపోతోంది. 'పొరపాటుని క్షమించమ్మా!' అనుకొని కంటినిండా అమ్మరూపాన్ని నింపుకొని... ''అమ్మా...'' అంటూ తల్లి దగ్గరకు వెళ్ళింది వల్లి.
''లేచేవా తల్లీ? ఉండు కాఫీ ఇస్తాను. ఈలోపు తండ్రీ, కూతుళ్ళు కబుర్లు చెప్పుకోండి'' అంటూ వంట గది వైపు వెళుతున్న తల్లిని చెయ్యి పట్టుకొని ఆపి... ''అమ్మా, ఈరోజు కాఫీ బ్రేక్ఫాస్ట్‌ నేను తయారు చేస్తాను. ఎప్పుడూ చదువు హడావిడిలో ఉండి నేను పని అసలు నేర్చుకోలేదు. నువ్వు నాకు నేర్పిస్తావా?'' అంటూ సంతోషంగా వెలిగిపోతున్న కూతురు మొహం చూసి, 'అమ్మయ్య నా కూతురి ముఖంలో నవ్వుని చూశాను' అనుకొంది భువన.
''ఏ విషయాలూ ఇంట్లో దాచకూడదు. ఎందుకు ఇలా చేశావు? తప్పయినా ఒప్పయినా తల్లితండ్రులకు చెప్పాలమ్మా! మేము తల దించుకునే పని నువ్వెప్పుడూ చెయ్యవు. మాకు తెలుసు తల్లీ'' అంటూ కూతురుని సుతి మెత్తగా మందలించాడా తండ్రి. - తెలికిచెర్ల

విజయలక్ష్మి
9301421243