May 13,2022 19:37

ఈ ఏడాది సంక్రాంతి సెలవుల్లో అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాం. మొదటిరోజు చుట్టుపక్కల పిల్లలందరితో పరిచయమైంది. తొక్కుడు బిళ్ల, దాగుడుమూత, గోళీలాట, కోతికొమ్మచ్చి ఆడాము. తర్వాత దగ్గర్లోని తోటకి వెళ్ళాం. జామకాయలు కోసుకొని తిన్నాం. మరుసటి రోజు చెరువు గట్టు దగ్గరకు వెళ్లాం. కొంతమంది అన్నయ్యలు చెరువులో ఈత కొట్టారు. గట్టున ఉండి మేమంతా కేరింతలు కొడుతూ ఆనందించాం. రావిచెట్టు ఆకులతో బూరలు తయారు చేసి పీపీ మని శబ్దం వచ్చేలా ఊదుతూ తిరిగాం. తుమ్మకాయలు తీసి కాళ్ళకు గజ్జెలు చేశాము. మట్టితో బొమ్మలు చేసి ఆడాము. పండక్కి అమ్మమ్మ చేసిన పిండి వంటలు రుచిగా ఉన్నాయి. రోజంతా ఆడి అలసిపోయిన నాకు అమ్మమ్మ రాత్రి పూట ఆరు బయట కూర్చుని గోరుముద్దలు తినిపించింది. ఊరిలోని పిల్లలందరం గాలి పటాలతో ఆడాము. ఇలా సంక్రాంతి సెలవులు ఆనందంగా గడిచాయి. ఆ జ్ఞాపకాలు ఎప్పటికి మరిచిపోలేను.