Jan 14,2022 21:32

ప్రజాశక్తి -తుళ్లూరు (గుంటూరు జిల్లా) :అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) ఆధ్వర్యంలో రైతులు నిరసనలు కొనసాగించారు. జెఎసి తలపెట్టిన సమర సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో భోగి వేడుకలు నిర్వహించారు. అమరావతి ఉద్యమ సెగలు పేరుతో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు అమరావతి ఉద్యమ గీతాలు పాడుతూ నృత్యం చేశారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తెచ్చిన జిఒల కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. అమరావతి కార్పొరేషన్‌ ప్రతిపాదనపై నిరసన తెలియజేస్తూ.. కార్పొరేషన్‌ ప్రతిపాదన కాపీని భోగి మంటల్లో పడేసి రైతులు నిరసన తెలిపారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, రాష్ట్రం భోగభాగ్యాలతో తులతూగాలనే ఆకాంక్షను రైతులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమరావతి అమరవీరులకు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ రైతులతో కలిసి ఉద్యమ సెగలు కార్యక్రమంలో పాల్గొన్నారు.