Nov 25,2021 07:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మూడు రాజధానుల ప్రతిపాదనల ఉపసంహ రణ నేపథ్యంలో రాజధాని అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పటికి అప్పగిస్తారన్నది రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజధాని అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లో దాదాపు 22,736 మంది రైతుల నుంచి 34,750 ఎకరాల భూములను సమీకరించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. 2,500 ఎకరాల భూములను సమీకరణకు ఇవ్వలేదు. 32,250 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. 2019 డిసెంబరు 23న అసెంబ్లీలో ఆమోదించిన సిఆర్‌డిఎ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలోగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, గత ప్రభుత్వం మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్‌లను ఇవ్వలేక పోయింది. సుమారు 54 వేల ప్లాట్లను 2018లో కాగితాలపైనే అప్పగించి చేతులు దులుపుకుంది. 2019లో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. 2019 డిసెంబరు 17న మూడు రాజధానుల ప్రతిపాదనతో అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించా లని రైతులు చేస్తోన్న పోరాటం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో భూములు ఇచ్చిన వారిలో వాస్తవ రైతులు ఎంత మంది ఉన్నారు? 2014కు ముందు భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయి? అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎవరికి ఇవ్వాలి? వీరిలో ఎంతమంది వాస్తవ రైతులు? రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారు ఎంతమంది? వారిలో ఇతర ప్రాంతాల వారు ఎందరు? రియల్‌ ఎస్టేట్‌ ప్రాతిపదికన కొనుగోలు చేసిన వారు ఎందరు? అనే వివరాల సేకరణలో సిఆర్‌డిఎ అధికారులు ఇప్పటికే ఉన్నారు. భూ సమీకరణ ప్రారంభమైన తరువాత రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారిని పెట్టుబడి దారుడుగా పరిగణించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు కాకుండా సాధారణ ప్లాట్లను మాత్రమే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. రాజధానిలో ఒక్కో ఎకరం అభివృద్ధికి రూ.2 కోట్లు అవసరం అవుతాయని, రైతులు ఇచ్చిన, ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 50 వేల ఎకరాలకు లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి గత సోమవారం అసెంబ్లీ లో స్వయంగా వెల్లడించిన విషయం విదితమే.