Oct 13,2021 07:38
  • ఆదాయం 53,159 కోట్లు,
  • వ్యయం 90,071 కోట్లు
  • కేంద్ర నిధులు 58 వేలకుగానూ వచ్చింది 14 వేల కోట్లే
  • కాగ్‌ ఐదు నెలల నివేదిక వెల్లడి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బడ్జెట్‌లో అనుకున్న ఆదాయం రాక... ఖర్చులు పెరిగిపోవడంతో లోటు భారీగా పెరిగిపోతోంది. తాజాగా తొలి ఐదు నెలలకు సంబంధించిన ఆర్ధిక గణాంకాలను కాగ్‌ వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర పన్నుల ద్వారా రూ.53,159 కోట్లు ఆదాయం లభించగా, ఖర్చు మాత్రం రూ. 90,071 కోట్లుకు చేరుకుంది. ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం రూ.36,912 కోట్లకు చేరిపోయింది. ఆదాయ లోటు, ద్రవ్య లోటు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,77,106 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్‌ అంచనా కాగా ఐదు నెలల్లో రూ53 వేల కోట్లే రావడంతో ఖజానా విలవిలలాడుతోంది. అయితే 2020-21 ఆర్ధిక సంవత్సరంతో (23 శాతం) పోల్చి చూస్తే మాత్రం ఎక్కువ ఆదాయం వచ్చినట్లు తేలడం కొంతవరకు ఆర్ధికశాఖకు ఊరట కలిగిస్తోంది. ఒక్క సేల్స్‌ టాక్స్‌ మినహా మిగిలిన అన్ని పన్నుల్లోనూ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సేల్స్‌ టాక్స్‌లో దాదాపు 39 శాతం వసూళ్లు జరిగాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పాతిక శాతానికే పరిమితమయ్యాయి. రూ.57,930 కోట్లు పలు రూపాల్లో రావాల్సి ఉండగా, 14 వేల కోట్ల వరకు మాత్రమే రాష్ట్ర ఖజానాకు అందాయి. కాగా, మొత్తం వ్యయానికి సంబంధించి 84 వేల కోట్ల వరకు రెవెన్యూ వ్యయమే నెలకొంది. పెట్టుబడి వ్యయం కేవలం రూ.5723 కోట్లు మాత్రమే రికార్డయింది.
 

                                                         రుణ సేకరణతోనే...

ఆదాయం కన్నా వ్యయం రూ.36,912 కోట్లుగా ఉండటంతో అంతరాన్ని రుణ సమీకరణ ద్వారానే భర్తీ చేసినట్లు తేలింది. బడ్జెట్‌లో రూ.37,029 కోట్లు రుణ సేకరణగా చూపించగా, కేవలం ఐదు నెలల్లోనే 99.86 శాతం రుణాలను సేకరించుకున్నారు. అయితే తాజాగా కేంద్రం రుణ సౌకర్యాన్ని పెంచడం వల్ల కొంతవరకు ఊరట లభిస్తుందని చెప్పాలి.