Aug 08,2022 07:15

అమృతోత్సవమే ఇది
మువ్వన్నెల ముచ్చటంతా
ముఖానికి పూసుకోవాల్సిన సందర్భమే
బులుపును జెండాలా ఎగరేసే సంబరమే
హనుమంతుడిలా గుండెలు చీల్చుకొని
దేశభక్తిని బహిరంగ పరుచుకునే వేడుకే ఇది!

కానీ, కన్నీటి కేతనాలు ఎగురుతున్న చోట
ముసిముసిగా తిరంగా నవ్వగలదా?
చేసిన నేరానికో చేయని నేరానికో
పేదలు మగ్గుతున్న జైలు ప్రాంగణాల్లో
జెండాపిట్ట కళ్ళనుండి జీవకళ ఉట్టిపడుతుందా?
ప్రశ్నలై గొంతెత్తే మేధోపతంగుల్ని
పెడరెక్కలు విరిచికట్టిన చీకటి గదుల్లో
స్వేచ్ఛాకాశాలను కలగంటుందా?

పలుకుబడి గల రక్తపు చేతులెన్నో
చట్టంచెట్టు నుండి ఆఖరి హక్కుల పండును కూడా
గుంజుకుంటున్న చైతన్య జాతర ఇది..
ఆకలి బాబయ్యా అని చేయి చాస్తున్నవాడికి
ఊపిరి పీల్చుకునే హక్కును సైతం
వేరెవరో ప్రసాదిస్తున్న మంటిబుక్కడాల నేలిది..
సంపద పోగుల మీద ఎగిరే పతాకానికీ
దారిద్య్రం ఒంటిమీద మొలిచిన బావుటాకీ
నింగి సైతం ఒకేలా వందనం చేయడంలేదు

రాజ్యాంగ పీఠిక మీద
పీఠమేసి కూర్చున్న ఐరావతం
మహాసంపన్న కుటుంబాల వ్యాపార
కల్పవృక్షాల కిందికి కామధేనువయి కదిలిపోతుంది
చిన్న గొట్టంతో బస్తా పొట్టలోకి పొడిచి
కొన్ని కేజీల బియ్యం కాజేసినంత లాఘవంగా
బడ్జెట్‌ దేహం నుండే నేరుగా కొన్ని జలగలు
చెమట నెత్తురు పీల్చుకుంటాయి
వేయి చేతుల కులం పిడికిలిలోకి
తన్మయంగా ఓటు తరలిపోతుంది
పాకుడురాళ్ల మీద జారిపడ్డట్టు
చూపుడు వేలు మీద చుక్క పడుతుంది

ప్రతి ఇంటిపై వెలిగే జాతీయ పతాకం సాక్షిగా
ఈవేళయినా నిజం చెప్పండి
పంపకాల సారాంశంలో
అమృతమెవరికి దక్కింది?
హాలాహల మెవరికి మిగిలింది?
- కంచరాన భుజంగరావు
94415 89602