Aug 05,2022 16:10

న్యూఢిల్లీ :  నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా లేని కుక్కర్‌లను విక్రయించినందుకుగాను డబ్బులు తిరిగి చెల్లించాల్సిందిగా కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికారిక సంస్థ (సిసిపిఎ) ఆదేశించింది. అమెజాన్‌ ద్వారా కుక్కర్‌లను కొనుగోలు చేసిన 2,265 మంది వినియోగదారుల నుంచి వాటిని వెనక్కి తీసుకుని, వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయాలనీ ఆదేశించింది. అమెజాన్‌కు రూ.1 లక్ష జరిమానాను విధించింది. నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న దేశీయ ప్రెజర్‌ కుక్కర్‌లను అమెజాన్‌ ప్లాట్‌ఫాంపై విక్రయించిన వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న సిసిపిఎ ఈ చర్యలు తీసుకుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్‌తో పాటు ఈ ప్లాట్‌ఫామ్‌లతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకు కూడా నోటీసులను జారీ చేసింది. కంపెనీ వివరణను పరిశీలించిన తర్వాత 2,265 ప్రెజర్‌ కుక్కర్లు నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని గుర్తించామని, ఈ కుక్కర్‌ల విక్రయం ద్వారా అమెజాన్‌కు కమీషన్‌ రుసుము రూపంలో రూ.6,14,825.41 వచ్చినట్లు తేలిందని సిసిపిఎ పేర్కొంది. వినియోగదారుల నుండి వాటిని వెనక్కు రప్పించాలని అమెజాన్‌కు సూచించామని పేర్కొంది. నిబంధనల పాటింపునకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలనీ ఆదేశించింది.