Oct 18,2021 06:41

పచ్చపచ్చని పైరమ్మా
ఎక్కడ మాయమయ్యావమ్మా
చల్లచల్లని మబ్బుధారమ్మా
ఎందుకు అలిగావమ్మా?

మట్టిపరిమళ మేఘం కానరాకున్నది
పంటచేల సమాధుల పైన
నవ నాగరికత గొడుగు విప్పినది
పరాయీకరణ పొట్లం విప్పుతున్నాడొకడు
భూమితల్లిని తాకట్టుపెట్టి
భవనాలను భుజాలకెత్తుకున్నాడింకొకడు

ప్లాస్టిక్‌తో జీవితాలను నిర్మిస్తున్నారమ్మా
పుడమి కడుపులో
కార్చిచ్చును వెలిగిస్తున్నారమ్మా
నదుల దేహాలను పీల్చిపిప్పి చేస్తున్నారమ్మా!
ఏ గుండెగూట్లోనూ
ఆకుపచ్చని దీపం వెలగట్లేదమ్మా
ఏ రైతు తలుపు తట్టినా
ఆత్మహత్యల దు:ఖం తగ్గట్లేదమ్మా
రాజ్యమెప్పుడూ చూసీచూడనట్టు
కన్ను చాటేస్తుంది
చిగిర్చిన గొంతుకలను
అక్కడికక్కడే అణిచేస్తుంటుంది!

పచ్చపచ్చని పైరమ్మా
అందుకేనా మాయమయ్యావు
చల్లచల్లని మబ్బుధారమ్మా
ఇందుకేనా అలకబూనావు!
- పద్మావతి రాంభక్త
99663 07777