Oct 01,2022 20:58

బీజింగ్‌ : హ్యాకింగ్‌, సైబర్‌ దాడుల సామ్రాజ్యంగా అమెరికా పేరు సంపాదించుకుంది. గూఢచర్యానికి, చౌర్యానికి పెట్టింది పేరుగా వున్న అమెరికా ఇటీవల రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడింది. రీసెర్చ్‌ డేటా, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నంలో భాగంగా చైనాలోని నార్త్‌వెస్ట్రన్‌ పాలిటెక్నికల్‌ యూనివర్శిటీ (ఎన్‌పియు) ఫ్యాకల్టీకి, విద్యార్ధులకు పరిశోధనా సమీక్షల పేరుతో ఇ మెయిల్స్‌ పంపుతున్నట్లు వెల్లడైంది. జూన్‌ 22న యూనివర్శిటీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిపై సెప్టెంబరు ప్రారంభంలో చైనాకి చెందిన నేషనల్‌ కంప్యూటర్‌ వైరస్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (సివిఇఆర్‌సి) దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఎ)కి అనుబంధంగా వున్న సైబర్‌ వార్‌ఫేర్‌ ఇంటెలిజెన్స్‌ సమాచార యూనిట్‌ టెయిలర్డ్‌ యాక్సెస్‌ ఆపరేషన్స్‌ (టిఎఓ) కార్యాలయమే ఈ కుట్రకు పాల్పడిందంటూ అన్ని క్లూస్‌ అటువైపే వేలెత్తి చూపిస్తున్నాయి. టిఎఓ నిరంతరంగా సాగిస్తున్న దాడుల్లో 40కి పైగా వేర్వేరు సైబర్‌ దాడుల ఆయుధాలను ఉపయోగించినట్లు నివేదిక వెల్లడించింది. వీటిలో అత్యంత రహస్యంగా ప్రయోగించిన 'సక్షన్చార్‌' కూడా వుంది. యూనివర్శిటీ నెట్‌వర్క్‌లో 1100కి పైగా అనుమానాస్పద లింకులను ప్రవేశపెట్టారు. 90 కమాండ్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. కోర్‌ టెక్నాలజీ డేటా, కీ నెట్‌వర్క్‌ ఎక్విప్‌మెంట్‌ కాన్ఫిగరేషన్స్‌, నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ డేటా, కోర్‌ ఆపరేషనల్‌ డేటా ఇవన్నీ కూడా చౌర్యానికి లక్ష్యాలుగా మారాయి. ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడించిన అంశాలు బాగా తెలిసిన వారికి టిఎఓ కూడా బాగా తెలుస్తుంది. కంప్యూటర్‌ హ్యాకర్లు, ఇంటెలిజెన్స్‌ విశ్లేషకులు, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ డిజైనర్లు, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లుతో కూడిన అమెరికా హ్యాకర్లకి సంబంధించిన జాతీయ బృందాన్ని టిఎఓ నిర్వహిస్తోంది. విదేశీ లక్ష్యాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని వారి కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్స్‌ వ్యవస్థలను, పాస్‌వర్డ్‌లను తెలుసుకోవడం, హ్యాకింగ్‌ చేయడం ద్వారా సేకరించడమే టిఎఓ ప్రధాన కర్తవ్యంగా వుంది. ఇటీవలి సంవత్సరాల్లో చైనా దేశీయ నెట్‌వర్క్‌ లక్ష్యాలపై వేలాదిగా సైబర్‌ దాడులకు అమెరికా పాల్పడింది. వేలాది నెట్‌వర్క్‌ పరికరాలను (నెట్‌వర్క్‌ సర్వర్లు, ఇంటర్‌నెట్‌ టెర్మినల్స్‌, నెట్‌వర్క్‌ స్విచ్‌లు, టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌లు, రూటర్లు, ఫైర్‌వాల్స్‌ తదితరాలు) నియంత్రించింది. 140జిబిల కన్నా విలువైన డేటాను దొంగిలించిందని సివిఇఆర్‌సి నివేదిక పేర్కొంది.