Jun 10,2021 12:02

వాషింగ్టన్‌ : వచ్చే ఏడాది నాటికి 100 దేశాలకు 50 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించాలని అగ్ర దేశం అమెరికా భావిస్తోంది. ఈ మేరకు అమెరికా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థ ఫైజర్‌-బయోఎన్‌టెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పేద దేశాలకు వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచేందుకు మరింత కృషి చేయాలని పేర్కొన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు, న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నాయి. బ్రిటన్‌లో కార్న్‌వాల్‌లో జూన్‌ 10న ప్రారంభం కానున్న మూడు రోజుల జి-7 శిఖరాగ్ర సమావేశంలో దీనికి సంబంధించిన ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లను ధనిక దేశాలు కొనుగోలు చేయడంతో... ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దీంతో అమెరికాపై ఒత్తిడి పెరగడంతో ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా తన జనాభాలో సగం మందికి పైగా టీకాలు వేయగా... వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌ బయలు దేరడానికి ముందు కూడా ఆయన ఇటువంటి సూచనలే చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన ఫైజర్‌ సిఇఒ అల్బర్ట్‌ బౌర్లాతో కలిసి ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.