Jul 29,2021 22:29

బయో మెట్రిక్‌ ఆధారంగా సరుకులు
యాప్‌ డౌన్‌లోడ్‌లో అవస్థలు
పని చేయని ప్రభుత్వ ఫోన్‌లు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త విధానాలతో అంగన్‌వాడీలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే పలు యాప్‌లతో సతమతమవుతున్న కార్యకర్తలకు కొత్త విధానంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక నుంచి బయోమెట్రిక్‌ ఆధారంగా సరుకులు అందజేయాలని ప్రభుత్వం చెబుతోంది. యాప్‌ల ఆధారంగా సక్రమంగా పని చేయాలంటే సౌకర్యవంతమైన ఫోన్లు ఇవ్వాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అందజేసిన ఫోన్లన్నీ చాలా వరకూ పాడయ్యాయి. సొంత ఫోన్లలో పని చేద్దామన్నా యాప్‌ డౌన్‌లోడ్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో సరుకులు అందక లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
బయోమెట్రిక్‌ ద్వారా పోషకాహారం
జిల్లాలో 64 మండలాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 5,546 అంగన్‌వాడీలు కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,23,575 మంది పిల్లలు ఉన్నారు. వీటి పరిధిలో 5001 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 4,818 ఆయాలు విధులు పనిచేస్తున్నారు. 35,534 మంది బాలింతలు, 34,130 మంది గర్భవతులు, 48,084 మంది సంవత్సరం లోపు చిన్నారులు, 35,772 మంది సంవత్సరం నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు, 1,14372 మంది మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు సేవలు అందుతున్నాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భిణులు, బాలికలు, పిల్లలకు కందిపప్పు, నూనె, కోడిగుడ్లతో పాటు చిక్కీలు, జొన్నపిండి, రాగిపిండి, బెల్లం తదితర వస్తువులు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారానికి ఇకపై బయోమెట్రిక్‌ తప్పనిసరి చేశారు. సరుకులు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో వివరాలు సేకరించి నమోదు చేయాల్సి ఉంది. అనంతరం బయోమెట్రిక్‌ విధానంలో జూన్‌ నెల నుంచి తొలుత పాలు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. భవిష్యత్తులో ఇతర సరకులనూ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సకాలంలో అందని పౌష్టికాహారం
పారదర్శకత పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం బాగానే ఉన్నా ఆచరణలో అమలుకి అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఈ విధానంపై కార్యకర్తలకు ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదు. వారి వద్ద ఉన్న సెల్‌ ఫోన్లలో యాప్‌ సక్రమంగా డౌన్‌లోడ్‌ కావడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఇటు కార్యకర్తలు తీవ్ర అవస్థలు పడుతుండగా అటు సరకులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూలై నెల నుంచి బయో మెట్రిక్‌ విధానంలో పాలు అందించేందుకు నిర్ణయించారు. వాస్తవానికి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రతి నెలా 2, 3 తేదీల్లో పంపిణీ చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైతే 10వ తేదీలోగా అందిస్తారు. కానీ ఈ నెల పూర్తవుతున్నప్పటికీ అనేకమంది లబ్ధిదారులకు సరుకులు సరఫరా చేయలేదు.
పాడైన ప్రభుత్వ ఫోన్లు
2017లో కార్యకర్తలకు ఇచ్చిన సెల్‌ఫోన్లు నాసిరకంగా ఉండడంతో 90 శాతం ఫోన్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో అనేకమంది వాటిని అధికారులకు తిరిగి ఇచ్చేశారు. ఉన్న వాటిలో పాతవి కావడం సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ లేకపోవడంతో యాప్‌ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతమంది కార్యకర్తల సొంత ఫోన్లలో డౌన్‌లోడ్‌ అయినప్పటికీ పని చేయడం లేదు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎలాంటి వివరాలు నమోదు చేయలేకపోతున్నారు.
కొత్తఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలి
అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ కోసం రకరకాల యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, లబ్ధిదారులతో బయోమెట్రిక్‌ వేయించాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. పంపిణీ చేసిన నాసిరకం సెల్‌ ఫోన్లు చాలా వరకూ పాడయ్యాయి. సొంత ఫోన్లు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నాం. కావున సెంటర్ల నిర్వహణకు కొత్తగా సెల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలి.
టి.గంగారత్నం, అంగన్‌వాడీ, జి.దొంతమూరు, రంగంపేట మండలం
సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వం అందజేసిన సెల్‌ఫోన్లన్నీ సక్రమంగా పనిచేయక అధికారులకు వాటిని తిరిగి ఇచ్చేశాం. పోషకాహారం పంపిణీ ఇక నుంచి బయోమెట్రిక్‌ ద్వారా ఇవ్వాలని చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలున్నాయి. బయోమెట్రిక్‌ డివైజ్‌లు ఇవ్వలేదు. కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్‌ సమస్యలు వస్తున్నాయి. యాప్‌ డౌన్‌లోడ్‌ కావడం లేదు. ఇవన్నీ పరిష్కరించకుండా పారదర్శకంగా సరుకులను అందజేస్తామని ప్రభుత్వం ఎలా చెబుతుంది. ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్లు పోస్టులను భర్తీ చేసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకోవాలి.
ఇ.చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌.
సమస్యల పరిష్కారానికి చర్యలు
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ యాప్‌ ద్వారానే కచ్చితంగా పాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బయోమెట్రిక్‌ ద్వారా పంపిణీ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. యాప్‌ డౌన్‌లోడ్‌లో చిన్నపాటి సమస్యలున్నా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాము. ఆగస్టు నెల నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటాం.
- జివి.సత్యవాణి, పీడీ, ఐసిడిఎస్‌