Nov 25,2022 15:45

న్యూఢిల్లీ  :   బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అనుమతి లేకుండా ఆయన ఫొటో, వాయిస్‌, వ్యక్తిగత లక్షణాలను వినియోగించకుండా ఢిల్లీ కోర్టు శుక్రవారం తాత్కాలిక నిషేధాన్ని విధించింది. తన సమ్మతి లేకుండా తన ఇమేజ్‌, వాయిస్‌, వ్యక్తిగత లక్షణాలను వినియోగించకుండా రక్షణ కల్పించాలంటూ అమితాబ్‌ ఢిల్లీ కోర్టును కోరారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తన పేరు, ఇమేజ్‌, వాయిస్‌లను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్స్‌, పుస్తక ముద్రణ సంస్థలు, కెబిసితో చట్టవిరుద్ధంగా సంబంధం కలిగిన లాటరీ నిర్వాహకులు, టి షర్ట్స్‌ విక్రయించేవారితో పాటు ఇతర వ్యాపార సంస్థలు ఆయన ఇమేజ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని అమితాబ్‌ తరపున హాజరైన న్యాయవాది హరీష్‌ సాల్వే తెలిపారు. కొందరు చట్టవిరుద్ధంగా తన పేరుతో వెబ్‌ డొమైన్లు నమోదు చేశారని అన్నారు. సెలబ్రిటీగా ఆయన ప్రచార హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. దీంతో అమితాబ్‌ అనుమతి లేకుండా ఏ వ్యక్తి గానీ, సంస్థ గానీ ఆయన పేరు, ఫొటో, వాయిస్‌ను ఉపయోగించకుండా జస్టిస్‌ నవీన్‌ చావ్లా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అమితాబ్‌ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఐటీ శాఖ అధికారులు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. దీంతో ఆయన ఇమేజ్‌కు నష్టం వాటిల్లడంతో పాటు ఆయనకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. కొన్ని సంస్థలు వారి ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసేందుకు నటుడి అనుమతి లేకుండానే ఆయన సెలబ్రిటీ హోదాను ఉపయోగించడం ఆయనను బాధించిందని కోర్టు పేర్కొంది.