Sep 15,2021 06:29
  • మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాలపై సీతారాం ఏచూరి ఇంటర్వ్యూ

నయా ఉదారవాద సంస్కరణలను వామపక్షాలు మొదటి నుంచీ విమర్శిస్తూనే వచ్చాయి. గడిచిన మూడు దశాబ్దాల సంస్కరణల అనుభవాలను బట్టి వామపక్షాల విమర్శ సరైనదిగా నిరూపించబడినట్టుగా భావిస్తున్నారా ?

పూర్తిగా నిరూపించబడింది. (కార్పొరేట్ల) లాభాలను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా నయా ఉదారవాద సంస్కరణలు అమలు జరిగాయి తప్ప ప్రజలు లక్ష్యంగా కాదు. ప్రపంచ వ్యాప్త అనుభవం గాని, భారతదేశ అనుభవం గాని ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఇన్ని దశాబ్దాల నయా ఉదారవాద సంస్కరణలు లాభాలను గరిష్టంగా సంపాదించడమనే ఏకైక లక్ష్యంతో అమలు జరిగాయి. అందుకోసం ప్రజలను బలి చేశారు. ప్రజల్లో పేదరికం పెరిగింది. ఆర్థిక అసమానతలు అంతకంతా పెరుగుతూ పోయాయి. అన్ని దేశాలలోనూ ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రజల జీవితాల మీద దాని వినాశకర ప్రభావం కరోనా మహమ్మారితో మరింత పెరిగింది. ఇంకా దాని విధ్వంసం కొనసాగుతోంది. ''పెట్టుబడిదారీ విధానం ఉత్పత్తిని, పంపిణీని బ్రహ్మాండంగా పెంపొందించింది. ఒక మంత్రగాడు సృష్టించిన దుష్ట శక్తి అతని మంత్రాలతో అదుపు చేయలేనంత స్థాయికి పెరిగిపోయినట్లు ఈ దోపిడీ పద్ధతులు పెరిగిపోయాయి'' అని మార్క్స్‌ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.
       కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరను గ్యారంటీ చేయాలని రైతాంగం దేశంలో పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో సంస్కరణలు మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాయి. వందేళ్ళ క్రితం బలవంతంగా తమ చేత నీలిమందు పంటలను సాగు చేయించడానికి వ్యతిరేకంగా రైతులు సాగించిన 'చంపారన్‌ సత్యాగ్రహం' గుర్తుకొస్తోంది. ఇప్పుడు ఈ కార్పొరేట్‌ వ్యవసాయంతో (మోడీ తెచ్చిన నోట్ల రద్దు పర్యవసానంగా దెబ్బ తిన్న), చిన్న తరహా ఉత్పత్తి విధానం మరింత దెబ్బ తింటుంది. ఆహార కొరత ఏర్పడి అది కరువు కాటకాలకు సైతం త్వరలో దారితీస్తుంది.
        నయా ఉదారవాద విధానాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని నెలకొల్పే లక్ష్యంతో రూపొందిన సిద్ధాంతం. భారతదేశంలో అమలు జరుగుతున్న సంస్కరణలు ఆ విధానాలలో అంతర్భాగమే. అడ్డూ, ఆపూ లేకుండా గరిష్ట స్థాయిలో లాభాలను పోగు చేసుకోవడమే ఆ విధానాల లక్ష్యం. ఆ క్రమంలో పెట్టుబడిదారీ విధానపు 'కొల్లగొట్టే స్వభావం' పూర్తిగా బహిర్గతం అయింది. అదే దాని ''ఆటవిక ప్రవృత్తి'' (యానిమల్‌ స్పిరిట్స్‌). ప్రజల ఉమ్మడి ఆస్తులను, ప్రజా సేవలను, అన్ని రకాల ఖనిజ వనరులను భారీ స్థాయిలో ప్రైవేటుపరం చేయడం, ప్రజల మీద 'వినియోగ చార్జీలను' మోపడం దానిలో భాగం. నయా ఉదారవాదం ప్రపంచ వ్యాప్తంగాను, మన దేశంలో కూడా కార్పొరేట్లకు వరాల జల్లు కురిపించింది. అది అమలులో ముందుకు సాగుతున్నకొద్దీ ప్రపంచం మొత్తం మీద ధనవంతులపై విధించే పన్నులు 79 శాతం తగ్గాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో సంపద ఆవిరైపోయింది. కాని ఆ తర్వాత మూడేళ్ళలోనే శత కోటీశ్వరులంతా తమ సంపదను తిరిగి పొందగలిగారు. పైగా 2018 నాటికి రెట్టింపు చేసుకున్నారు. ఈ పెరుగుదల ఉత్పత్తిని పెంచడం ద్వారా సాధించలేదు. స్పెక్యులేషన్‌ ద్వారా పెంచుకున్నారు. ఇంత తీవ్రంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం చెందుతున్నప్పటికీ, దాని ప్రభావం స్టాక్‌ మార్కెట్‌లపై ఎందుకు పడలేదో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
        అదే ప్రపంచవ్యాప్తంగా జీతాల మీద బతికే వారిని చూస్తే వారిలో 80 శాతం... 2008 నాటి పతనం నుండి ఇప్పటికీ కోలుకోనేలేదు. పారిశ్రామిక కార్మికుల సంఘటిత శక్తి మీద దాడి ముమ్మరం అయింది. అమెరికాలో 1979లో ప్రతీ నలుగురు కార్మికులలో ఒకరు ట్రేడ్‌ యూనియన్లలో సభ్యులుగా ఉంటే ఇప్పుడు ప్రతీ పది మందిలో ఒక్కరు మాత్రమే యూనియన్లలో సభ్యులుగా ఉండగలుగుతున్నారు.
ఇటీవల జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌ అధిపతి) అంతరిక్ష యానం చేశాడు. దానికి ప్రతిస్పందిస్తూ (అంతర్జాతీయంగా అసమానతలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న) ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌ ప్రతినిధి దీపక్‌ జేవియర్‌ ''ఇప్పుడు మనం అసమానతల్లో అంతరిక్ష స్థాయికి చేరుకున్నాం. బెజోస్‌ 11 నిమిషాల అంతరిక్ష యానానికి సిద్ధం ఔతున్న ఈ సమయంలో ప్రతీ నిమిషానికీ పదకొండు మంది ఆకలితో మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంతరిక్షయానం మానవ తప్పిదమే కాని...మానవ విజయం ఎంతమాత్రం కాదు'' అని ప్రకటించాడు.
          పన్నుల విధానం చాలా అన్యాయంగా ఉంది. ఇది సంపన్నులకు అనుకూలంగా ఉంది. ఇంకోవైపు కార్మికులకు రక్షణ కరువైపోతోంది. ఇంత కరోనా మహమ్మారి కాలంలో కూడా అమెరికాలోని శత కోటీశ్వరుల సంపద లక్షా ఎనభైవేల కోట్ల డాలర్ల మేరకు అదనంగా పెరిగింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై గుత్తాధిపత్యం ఉన్న తొమ్మిది బడా ఫార్మా కంపెనీలు కొత్తగా శత కోటీశ్వరుల జాబితాలో చేరాయి.
ప్రభుత్వాలు నిర్వహించే కేంద్ర బ్యాంకులు దాదాపు 11 లక్షల కోట్ల డాలర్ల మేరకు ఈ 18 నెలల్లో ఖర్చు చేశాయి. అంటే గంటకు 83 కోట్ల 40 లక్షల డాలర్లు. మహమ్మారి విజృంభించాక ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి చేసిన ఈ ఖర్చు వలన గత ముప్ఫై ఏళ్ళలోనూ లేనంత ఎక్కువగా స్టాక్‌ మార్కెట్‌ సూచీ పెరిగింది. కాని ఇంకోవైపు ప్రజానీకం పెరుగుతున్న నిరుద్యోగంతో, పేదరికంతో, ఆకలితో, కనీస సదుపాయాల లేమితో నానా బాధలూ పడుతున్నారు. స్టాక్‌మార్కెట్‌కు వచ్చిన ఈ వాపుతో శత కోటీశ్వరులు ప్రయోజనం పొందుతున్నారు. ఇంత తీవ్ర ఆర్థిక పతనం నడుమ సంభవించిన ఈ స్టాక్‌ మార్కెట్‌ 'బుడగ' ఎల్లకాలమూ కొనసాగదు. ఇది ఎప్పుడో పేలిపోక తప్పదు. దాని పర్యవసానంగా మరింత వినాశనం, మరింత పేదరికం, మరింత ఆకలి తప్పవు.

1980 దశకం వరకూ వామపక్షాలు నెహ్రూ శకం నాటి ఆర్థిక విధానాలను విమర్శిస్తూ వచ్చాయి. ప్రస్తుత కాలం నాటి ఆర్థిక విధానాలపై విమర్శకు, అప్పటి విమర్శకు తేడా ఏమిటి ?

వును. మేము నెహ్రూ కాలం నాటి ఆర్థిక విధానాలను గట్టిగా విమర్శించాం. భారత పాలక వర్గాలు - అంటే బడా పెట్టుబడిదారీ వర్గ నాయకత్వాన ఉన్న బూర్జువా, భూస్వామ్య వర్గాలు - భారత దేశానికి స్వతంత్రం వచ్చాక ఎంచుకున్న ఆర్థికాభివృద్ధి పంథా మన దేశ స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలకు చేసిన వాగ్దానాలకు, ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేస్తోంది అన్న ప్రాతిపదికన విమర్శించాం. పేదరికాన్ని, ఆకలిని, నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతను తొలగించే బదులు ఆ పంథా వీటన్నింటినీ మరింత పెంచింది. నెహ్రూ కాలంలో ''సోషలిస్టు తరహా సమాజాన్ని నిర్మిస్తాం'' అన్న నినాదాన్ని ప్రభుత్వం ప్రచారం చేసేది. కాని ఆచరణలో పెట్టుబడిదారీ మార్గానే నడిచింది. లాభాలను పెంచుకోవడం పెట్టుబడిదారుల అసలు లక్ష్యం. మానవుల శ్రమను దోపిడీ చేసే పద్ధతి ద్వారా మాత్రమే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందగలదు.
     ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానాల మీద మా విమర్శ చాలా విభిన్నమైనది. నెహ్రూ కాలంలో సాధించిన కొద్దిపాటి ప్రజానుకూల అంశాలను కూడా ఇప్పుడు వేగంగా ధ్వంసం చేస్తున్నారు. ప్రణాళికా సంఘం ద్వారా రూపొందించే పంచవర్ష ప్రణాళికల అమలు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి అనే పద్ధతి, ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఆ రంగానికి మన ఆర్థిక వ్యవస్థలో ఆధిపత్యం ఉండే స్థాయి కల్పించడం భారతదేశానికి ఒక స్వతంత్ర ఆర్థిక పునాదిని కల్పించాయి. మోడీ ప్రభుత్వం ఇప్పుడు చాలా దూకుడుగా నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తూ మన ఆర్థిక పునాదిని మొత్తంగా నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తున్నది. ఇది ఒక్క పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. వ్యవసాయ రంగం లోకి కూడా చొరబడింది. కొత్త వ్యవసాయ చట్టాలు మన స్వతంత్ర పునాదిని నాశనం చేస్తున్నాయి.
     మన దేశంలో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ రంగం ముఖ్య భూమిక పోషించింది. అది ప్రైవేటు రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి కూడా తోడ్పడింది. అదే సమయంలో ప్రభుత్వ రంగం మన దేశార్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచంది. దానివలన మన దేశం పశ్చిమ దేశాల దయాధర్మం మీద ఆధారపడే దుస్థితి నుండి బైటపడ్డాం. మన దేశ స్వతంత్ర ఆర్ధిక పునాదిని, జాతీయ సంపదను పరిరక్షించుకోవలనే అవగాహన నుండే ఇప్పుడు వామపక్షాలు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నాయి.
 

/ తదుపరి భాగం రేపు /