
పిల్లలూ, ఈ రోజు బాబు జగ్జీవన్‌రామ్ జయంతి. ఆయన మనదేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. ఆయన గురించి తెలుసుకుందాం..
ఆయన బీహార్‌లో షాబాద్ (ప్రస్తుతం భోజ్‌పూర్) జిల్లాలోని చిన్న గ్రామమైన చాంద్వాలో ఏప్రిల్ 5, 1908వ తేదీన వసంతీదేవి, శోభీరామ్ దంపతులకు జన్మించారు. చిన్ననాటే తండ్రి చనిపోవడంతో అనేక ఇబ్బందుల మధ్య తల్లి సంరక్షణలో ఆయన చదువు సాగింది. రాత్రింబవళ్ళు పట్టుదలతో చదివి, ప్రతిభావంతుడిగా పేరు సంపాదించాడు. అణగారిన కుల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ను తిరస్కరించాడు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ను పొందాడు. చిన్న వయసులోనే భోజ్‌పురితో పాటు హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.
పాఠశాలలో పెత్తందారీ కులాల పిల్లలకు ప్రత్యేకంగా మంచినీటి కుండ కేటాయించటాన్ని వ్యతిరేకించాడు. అదే కుండలోని నీళ్లను తాగుతూ అందరూ సమానులే అని నిరసన వ్యక్తం చేశాడు. దాంతో ఆధిపత్య కుల విద్యార్థులు జగజ్జీవన్ రామ్‌పై దాడికి ప్రయత్నించారు. పరిస్థితి గమనించిన ఉపాధ్యాయులు నిమ్న కుల విద్యార్థులకు కూడా మంచినీటి కుండ ఏర్పాటు చేశారు. దానినొక వివక్షగా భావించిన జగ్జీవన్‌రామ్ పెట్టిన ప్రతి కుండను పగలగొట్టసాగాడు. తరువాత ప్రధానోపాధ్యాయుడు అందరికీ కలిపి ఒకే మంచినీటి కుండను ఏర్పాటు చేశాడు.
పెద్దయ్యాక దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గన్నాడు జగ్జీవన్‌రామ్. భారత రిపబ్లిక్ తొలి లోక్‌సభ (1952)లో ప్రవేశించిన జగ్జీవన్‌రామ్ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచాడు. 33 సంవత్సరాలకే కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానికిగా పనిచేశారు.