Jun 10,2021 21:33

బీజింగ్‌ : కొత్తగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలో నివాసానికి సిబ్బందిని పంపేందుకు చైనా సిద్ధమైంది. ముగ్గురు సిబ్బందిని రోదసీలోకి తీసుకెళ్లే రాకెట్‌ను వచ్చే వారం ప్రయోగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సిబ్బంది మూడు మాసాల పాటు రోదసీ స్టేషన్‌లో ఉంటారు. ఆ సమయంలో వీరు స్పేస్‌వాక్‌ చేస్తారు. స్టేషన్‌ నిర్మాణ, నిర్వహణ కార్యకలాపాలను, సైన్స్‌ ప్రయోగాలను కూడా చేపడతారు. ఈ స్టేషన్‌లోని ప్రధాన భాగమైన తియాన్హెను ఏప్రిల్‌ 29న కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గత నెలలో ఇంధనం, ఆహారం, అవసరమైన పరికరాలు తీసుకుని కార్గో అంతరిక్ష నౌక కూడా వెళ్లింది. షెంజూ-12 స్పేస్‌షిప్‌ను తీసుకెళుతున్న లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ వై12 రాకెట్‌ను బుధవారం లాంచ్‌పాడ్‌ మీదకు తరలించినట్లు చైనా మానవ సహిత రోదసీ ఇంజనీరింగ్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే బుధవారం దీన్ని ప్రయోగించనున్నారు. 70టన్నుల స్టేషన్‌ను విస్తరించేందుకు అవసరమైన రెండు లేబరేటరీ మాడ్యూల్‌ను పంపనుంది. ఇదంతా వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేయనున్నట్లు చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. ఇందుకుగాను 11 సార్లు రాకెట్లను ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వచ్చే వారం ప్రయోగించనున్న రాకెట్‌ మూడవది. ఈ మిషన్‌ కోసం శిక్షణ పొందుతున్న వ్యోమగాముల్లో రోదసీ ప్రయాణాల్లో ఆరితేరిన ప్రముఖులు, కొత్తవారు, మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 11మంది వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి చైనా పంపింది. ఈ అంతరిక్ష కేంద్రం 15 ఏళ్లపాటు వినియోగంలో ఉంటుందని చైనా అంతరిక్ష నిపుణులు తెలిపారు.