Mar 07,2021 16:46

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా మరో అద్భుతాన్ని సృష్టించింది. అంగారకుడిపై సూక్ష్మజీవులను గుర్తించడానికి చేపట్టిన సరికొత్త ప్రయోగాన్ని విజయవంతం చేసింది. నాసా ప్రయోగించిన ఆస్ట్రోబయాలజీ రోవర్‌.. పర్సెవెరెన్స్‌ (మార్స్‌ పర్సెవెరెన్స్‌ రోవర్‌) అంగారక గ్రహంపై ల్యాండ్‌ అయింది. ఈ ల్యాండింగ్‌ సక్సెస్‌ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్‌పై సూక్ష్మజీవులను గుర్తించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్‌ వల్ల కొన్ని అద్భుతాలను చూడబోతోన్నామంటూ వ్యాఖ్యానించింది.


అంగారక గ్రహంపై రోవర్‌ ల్యాండ్‌ అవుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. 'రోవర్‌లోని మైక్రోఫోన్‌ మార్స్‌ నుండి వచ్చే శబ్దాలను ఆడియో రికార్డింగ్‌ను అందించింది. ఇలాంటి శబ్దాలను, వీడియోను సాధించడం ఇదే మొదటిసారి. ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు' అని జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ డైరెక్టర్‌ మైఖేల్‌ వాట్కిన్స్‌ ప్రకటించారు. రోవర్‌ ల్యాండింగ్‌ను రికార్డు చేసేందుకు ఏడు కెమెరాలను ఆన్‌ చేశామని, రోవర్‌లో రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని నాసా సైన్స్‌ అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌ థామస్‌ జుర్బుచెన్‌ వెల్లడించారు.

అంతరిక్షంపై అన్వేషణ!


రోవర్‌ ఫిబ్రవరి 23 అరుణగ్రహంపై ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇది రెడ్‌ ప్లానెట్‌లో ప్రవేశించి, డీసెంట్‌ అండ్‌ ల్యాండింగ్‌ (ఇడీఎల్‌) చివరి నిమిషాల్లో ప్రధాన మైలురాళ్లను రికార్డు చేసింది. రోవర్‌ ల్యాండ్‌ కావడానికి ముందు పారాచూట్‌ విచ్చుకోవడంతో పాటు, అది కిందకి దిగుతున్న సమయంలో మూడు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగే హై-డెఫినిషన్‌ వీడియో క్లిప్‌ను సాధించారు. ఈ సందర్భంగా మార్స్‌ ఉపరితలం కూడా వీడియోలో కనిపించింది. గ్రహానికి దగ్గరవుతున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి నేలంతా ఎర్రగా ఉంది. రోవర్‌ అరుణగ్రహంపై దిగుతున్న సమయంలో లేచిన ధూళి మేఘం, పారాచూట్‌ సాయంతో వ్యోమనౌక నుంచి కిందకి దిగడం స్పష్టంగా కనిపించిందని నాసా ఇంజనీర్లు ప్రకటించారు.
 

ఏడు నెలల ప్రయాణం..
సుదూరంలో ఉన్న అంగారక గ్రహాన్ని అందుకోవడానికి నాసా ప్రయోగించిన ఈ ఆస్ట్రోబయాలజీ పర్సెవెరెన్స్‌ రోవర్‌ సుమారు ఏడునెలల పాటు ప్రయాణం సాగించింది. 472 మిలియన్‌ కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఆ సమయంలో దాని వేగం గంటకు 19 వేల కిలోమీటర్లు. అంగారక గ్రహం కక్ష్యలోనికి ప్రవేశించేంత వరకూ అదే వేగంతో దూసుకెళ్లింది. మార్స్‌ కక్ష్యలోకి ప్రవేశించిన వెంటనే దాని వేగాన్ని నాసా శాస్త్రవేత్తలు.. గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్‌ నుంచి నియంత్రించారు. క్రాష్‌ ల్యాండింగ్‌ కాకుండా జాగ్రత్తలను తీసుకున్నారు.
 

అంతరిక్షంపై అన్వేషణ!

దిగిన వెంటనే సంకేతాలు..
అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల సమయంలో ఇది ల్యాండ్‌ అయింది. నాసా శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన జెజెరో క్రెటర్‌ వద్ద ఇది దిగింది. ఈ ఆస్ట్రోబయాలజీ రోవర్‌ అంగారక గ్రహంపై దిగిన వెంటనే.. అక్కడి నుంచి సంకేతాలను పంపించింది. కొన్ని ఫొటోలను ట్రాన్స్‌ఫర్‌ చేసింది. గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్‌కు ఈ సంకేతాలు అందడంతో నాసా శాస్త్రవేత్తల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. నాసా ప్రయోగశాల చప్పట్లతో మారుమోగింది. ఈ తరహా ప్రాజెక్ట్‌ను చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంపై శాస్త్రవేత్తల కషి అనిర్వచనీయమంటూ అమెరికా ప్రభుత్వం వారిని అభినందించింది.
 

కఠిన ప్రదేశం జెజెరో క్రెటర్‌..
ఈ ఆస్ట్రోబయాలజీ రోవర్‌ అంగారక గ్రహంపై జెజెరో క్రెటర్‌ ప్రాంతాన్నే ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా అంగారకుడిపై గుర్తించిన అత్యంత కఠిన ప్రదేశం ఇదే. రాళ్లు రప్పలు, ఎత్తుపల్లాలు, లోతైన లోయలతో నిండి ఉండే ప్రాంతం జెజెరో క్రెటర్‌. ఏమాత్రం అనుకూలంగా లేని ప్రాంతంలో రోవర్‌ను ల్యాండ్‌ చేయించడం మరో ఎత్తు. దీన్ని నాసా విజయవంతం చేసింది. ఈ ప్రయోగంతో ఇప్పటి వరకూ మార్స్‌పైకి అత్యధిక రోవర్లను ప్రయోగించిన దేశంగా అమెరికా మరో రికార్డును నెలకొల్పింది. కాగా మొట్టమొదటి సారి 1972లో అమెరికా పయొనీర్‌-10 వ్యోమనౌకను ప్రయోగించింది. అయితే 2003 జనవరిలో ఆఖరి సందేశం పంపింది. అయితే తొలిసారి శనిగ్రహాన్ని క్లిక్‌మనిపించిన ఘనత వాయేజర్‌-1కి దక్కింది. 1977 సెప్టెంబర్‌ 5న అమెరికా దీన్ని ప్రయోగించింది. 1963 నవంబర్‌ 21న తుంబా నుంచి తొలి సౌండింగ్‌ రాకెట్‌ను ప్రయోగించడంతో భారత్‌ అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.