
చెన్నై : తమిళనాడులో పాల సేకరణను నిలిపివేయాల్సిందిగా గుజరాత్ డెయిరీ అమూల్‌ను ఆదేశించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఈమేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు గురువారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో అమూల్ పాలసేకరణ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అమూల్ (కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్) పాలసేకరణ కారణంగా తమిళనాడుకి చెందిన ఆవిన్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. అమూల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ లైసెన్స్‌ను వినియోగించి కృష్ణగిరి జిల్లాలో చిల్లింగ్ సెంటర్లు, ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు ఇటీవల గుర్తించామని అన్నారు.
తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, వెల్లోర్, రాణిపేట్, కాంచీపురమ్, తిరువల్లూర్, తిరుపత్తూర్ జిల్లాల్లోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఒ), స్వయం సహకార సంఘాలు (ఎస్‌పిఒ) నుండి పాలను సేకరిస్తోందని అన్నారు. సహకార సంఘాలు ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోకుండా... ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చేయడం ప్రామాణిక పద్ధతి అని స్టాలిన్ ఉద్ఘాటించారు. అమూల్ సేకరణ ఆపరేషన్ వైట్ ఫ్లడ్ స్ఫూర్తికి విరుద్ధమని.. దేశంలో ప్రస్తుత పాలకొరతను మరింత తీవ్రతరం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఇది వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
అవిన్ గ్రామీణ ప్రాంతాల్లోని 9,673 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను పర్యవేక్షిస్తోందని, సుమారు నాలుగు లక్షల మందికి పైగా సభ్యుల నుండి 35 ఎల్‌ఎల్‌పిడి పాలను సేకరిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏర్పాటు ప్రతి ఏడాది పాల ఉత్పత్తిదారులకు ఏకరీతిలో లాభదాయకమైన ధరలు లభించేలా హామీ ఇస్తుందని అన్నారు. అమూల్ చర్య దశాబ్దాలుగా నిజమైన సహకార స్ఫూర్తితో నడుస్తున్న అవిన్ మిల్క్‌షెడ్ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమూల్ తన పాలు, పెరుగు ఉత్పత్తులతో బెంగళూరు మార్కెట్‌లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించి రాజకీయ వివాదాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే.