Oct 18,2021 19:05

ఏ మతమైనా... చెప్పేది ఒక్కటే. తోటి వారి పట్ల సేవా భావంతో, ప్రేమతో మెలగాలి అని . కొంతమంది మాత్రం మతం పేరుతో అరాచకం సృష్టిస్తూ... ఇతర మతాల వారిపై దాడులకు పాల్పడుతున్నారు. మతం పేరుతో మనుషుల మధ్య చిచ్చు రేపుతున్నారు. కాని 68 ఏళ్ల ఎల్విన్‌ మాత్రం వారికి పూర్తి భిన్నం. తాను ఆరాధిస్తున్న దైవం కన్నా... ఇతరులకు సేవ చేయడంలోనే ఎక్కువ ఆనందం పొందుతున్నారు. ఎంతో మంది అనాథలను చేరదీసి, నిత్యం వారికి సేవ చేస్తూ వారందరికీ అమ్మగా మారారు.

రోడ్డు మీద మతిలేకుండా తిరుగుతున్న వారిని, వృద్ధులను చేరదీసింది ఎల్విన్‌. వీరికి ప్రతిరోజూ సేవలు చేస్తూ.. సేవా మూర్తిగా మారింది. వీరిలో కొందరు తల్లిని కోల్పోగా, మరికొందరు తండ్రి లేనివారు. ఇంకొంత మంది అయినవారి నిరాదరణకు గురైనవారు. వీరందరూ మానసిక వికలాంగులు. వీరంతా వేర్వేరు మతాలు, కులాలకు చెందిన వారు. వారినే తన పిల్లలుగా భావించారు ఎల్విన్‌. అనాధలైన 22 మంది మానసిక దివ్యాంగులకు ఓ అమ్మలాగా సేవలందిస్తున్నారు. ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్డులో గల సాన్‌జో సేవాలయం పేరిట నడుస్తున్న ఈ శరణాలయం అభాగ్యులకు ఆసరాగా నిలుస్తోంది.

అనాథలకు అమ్మ

మానసిక స్థితి సరిగా లేని వారిలో కొందరు యువకులు, మరి కొందరు వయస్సు మళ్లిన వారు ఉన్నారు. రోడ్లపై తిరుగుతున్న వారిని తన ఆశ్రయానికి తీసుకొచ్చి చేరదీశారు. వీరిలో కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వారికి చికిత్సలు అందిస్తూ వారి వివరాల సేకరించారు ఎల్విన్‌. కుటుంబాల ఆదరణ లేక వీరంతా ఇక్కడికి చేరారంటారు ఆమె. వీరికి ప్రతిరోజూ ముఖం కడగడం దగ్గర నుంచి స్నానం చేయించడం, ఆహారం తినిపించడం, మందులు వేయడం అన్ని పనులు ఆమె దగ్గరుండి చేస్తున్నారు. వారిపై చూపిస్తున్న ప్రేమ, క్రమంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చింది. నెమ్మదిగా క్రమశిక్షణ అలవడింది. తామే స్నానాలు చేయడం, ప్రాంగణం శుభ్రం చేయడం, మొక్కలకు పాదులు చేయడంలాంటి చిన్న చిన్న పనులు ఆశ్రయం పొందుతున్న వారే స్వయంగా చేస్తున్నారు.

అనాథలకు అమ్మ

సేవలోనే సంతోషం
కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు చెందిన ఎల్విన్‌ 17వ ఏటనే అనాథలకు సేవ చేయాలనే తలంపుతో ఇటలీకి చెందిన సిష్టర్‌ ఎడాల్ఫాకు దగ్గరైంది. ఆ తర్వాత కొంతకాలం గోవా, సికింద్రాబాద్‌ ,బంబాయి ఆశ్రమాల్లో పని చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. అక్కడ ఎనిదేళ్ళు సేవ చేసి, ఇండియాకు తిరిగి వచ్చారు. 19 ఏళ్ల క్రితం యర్రగొండపాలెం వచ్చారు. ఇతరులకు సేవ చేయడంలో తన ఆనందం వెతుక్కుంటున్న ఎల్విన్‌ని అందరూ అమ్మ అని పిలుస్తారు. ఇప్పటిదాకా సుమారు 800 మందికి ఆశ్రయం కల్పించారు. వీరి మానసిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఆటపాటలు నేర్పిస్తున్నారు. ఎక్కువ మంది ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. కొంతమందిని వారి కుటుంబసభ్యులు వచ్చి తీసుకొని వెళ్లారు. దీర్ఘకాలిక వ్యాధులు, తీవ్ర అనారోగ్యంతో మరి కొంతమంది చనిపోయారు. ఇప్పుడు 22 మంది అనాథలు మిగిలారు.

​    ​

దాతల సాయంతో..
శరణాలయం ప్రారంభించిన రెండు సంవత్సరాల వరకు హైదరాబాద్‌ నుంచి ఆర్థిక సాయం అందింది. ఆ తర్వాత ఆశ్రమం నడపడం కష్టంగా మారింది. దీంతో వీరికి భోజనం పెట్టడం కూడా భారమైంది. ఆ సమయంలో బియ్యం కోసం కొందరి అధికారులను ఆశ్రయించారు ఎల్విన్‌. కూరగాయాల మార్కెట్‌కు వెళ్లి అర్థిస్తుండేవారు. ఆమె నిస్వార్ధ సేవలను గుర్తించిన దాతలు, స్వచ్చంధ సంస్థలు ఆర్థికంగా, తమవంతు సాయం అందిస్తూ సేవలు కొనసాగేలా ప్రోత్సహిస్తున్నారు.

​    ​

- షేక్‌ వలీ సాహెబ్‌
యర్రగొండపాలెం విలేకరి