Dec 19,2021 12:45

ఎన్నో దశాబ్దాలుగా తమిళ చలన చిత్ర రంగంలో ఫ్యూడల్‌ భావజాలం గల కథలనే తీస్తూ వచ్చారు. కానీ పా.రంజిత్‌ రాక ఇండిస్టీలోనే ప్రత్యేకత సంతరించుకునేలా చేసింది. అట్టడుగు వర్గాల సమస్యలు, కన్నీళ్లు, కష్టాలపై సామాజిక కోణంలో అనేక చలన చిత్రాలను తీశారాయన. ఈ యాంగిల్‌లో సినిమాలు తీయడానికి నిర్మాతలను ఒప్పించడానికి రంజిత్‌ మొదట్లో ఎంతో శ్రమించారు. సామాజిక కోణంలో చలనచిత్రాలు తీసే సక్సెస్‌పుల్‌ డైరెక్టర్‌గా ఇండిస్టీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. రంజిత్‌ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ప్రజలను ఆలోచింపజేస్తాయి. అట్టడుగు వర్గాలకు నాడు, నేడు సమాజంలో జరిగే అన్యాయాలపై చర్చ నడిచేలా చేస్తున్నాయి. పా. రంజిత్‌ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు..

 

అణగారిన వర్గాలకు అండగా..పేరు : పా.రంజిత్‌
పుట్టినతేది : 08 డిసెంబరు 1982
జన్మస్థలం : చెన్నై ఆవడిలోని కరాలపాక్కం
చదువు : గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, చెన్నై
వృత్తి : సినిమా దర్శకుడు, స్క్రీన్‌ రైటర్‌, నిర్మాత
జీవిత
భాగస్వామి : అనిత
పిల్లలు : ఇద్దరు (కుమార్తె, కుమారుడు)

పా.రంజిత్‌ కళాశాల రోజుల్లోనే ఫిల్మ్‌ ఛాంబర్‌లో చేరారు. అక్కడే ప్రపంచ సినిమాలను చూడటం మొదలెట్టారు. అంతేకాదు క్రమం తప్పకుండా వార్షిక చలన చిత్రోత్సవాలకు హాజరయ్యేవారు. 'ది బాటిల్‌ ఆఫ్‌ అల్జీర్స్‌' (1966), 'సిటీ ఆఫ్‌ గాడ్‌' (2002) చిత్రాల నుంచి ఆయన ఎంతో ప్రేరణ పొందారు. సినిమాల గురించి అప్పటి వరకూ తనకున్న ఆలోచనలు మార్చుకునేలా ఆ చిత్రాలు చేశాయని అనేక సందర్భాల్లో రంజిత్‌ చెప్పారు. కాబట్టే తన సినిమాల్లో సామాజిక సమస్యలను ప్రదర్శించగలిగానని అంటారాయన.
    రంజిత్‌ మొదట తమిళ ఇండిస్టీలో శివ షణ్ముగం, థాగపన్‌సామి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. చిత్ర నిర్మాతలు లింగుస్వామి, వెంకట్‌ ప్రభు దగ్గర శిష్యరికం చేశారు. తర్వాత 2012లో రొమాంటిక్‌ కామెడీ 'అట్టకతి'్తతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. రెండవ సినిమాగా పొలిటికల్‌ డ్రామా 'మద్రాస'్‌ (2014), రజనీకాంత్‌ నటించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా 'కబాలి', 'కాలా'లకు 2016, 2018లో దర్శకత్వం వహించారు. ఇంకా ఈ ఏడాది విడుదలైన 'సర్పత్త పరంబరై' ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఆయన కొద్దికాలం క్రితమే 'నీలం ప్రొడక్షన్స్‌'ని స్థాపించారు. దానిద్వారా 'బివేర్‌ ఆఫ్‌ కాస్ట్స్‌', 'మిర్చ్‌పూర్‌' అనే పేరుతో రెండు డాక్యుమెంటరీలను విడుదల చేశారు. తర్వాత 'పరియేరమ్‌' విమర్శకుల ప్రశంసలతో భారీ విజయాన్ని సాధించింది. రంజిత్‌ త్వరలో విక్రమ్‌, కమల్‌హాసన్‌ హీరోగా నటించే సినిమాలకు తనదైన శైలిలో దర్శకత్వం చేయనున్నారు.
 

                                                         కొత్త ఒరవడితో ..

'రంజిత్‌ రాక తమిళ సినిమాకు చాలా ముఖ్యమైందని భావిస్తున్నాను. మా ఇండిస్టీలో అణగారిన వర్గాల వారికి ఎప్పుడూ చోటులేదు. ఒకవేళ అలాంటి పాత్రలు మా సినిమాల్లో ఉన్నా.. అవి అన్యాయంగానే ఉంటాయి. రంజిత్‌ ఎంతో ధైర్యంగా బాధితుల వైపు నిలబడి, సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మెచ్చుకోదగ్గ విషయం. నేడు 'జై భీం'లాంటి సినిమాలు వచ్చాయంటే రంజిత్‌ చిత్రాలే పునాది. ఆయన పనిని ఒక కులానికి సంబంధించిందిగా చూడలేను. రంజిత్‌ది ఒక కులానికి చెందిన గొంతు కాదు. సామాజిక న్యాయం కోసం పోరాడే గొంతుక మాత్రమే' అంటున్నాడు రంజిత్‌ దర్శకత్వం వహించిన సినిమా నిర్మాతల్లో ఒకరైన టి.జె. జ్ఞానవేల్‌.
 

                                        సాంస్కృతిక కార్యక్రమాలు నడుపుతూ..

పా.రంజిత్‌ తన సామాజిక పనిని మరొక రూపంలో విస్తరించారు. అది 'నీలం పన్పాతు మైయం' (నీలం సాంస్కృతిక కేంద్రం). అందులో వంద సంవత్సరాల దళిత పోరాటాన్ని పురస్కరించుకుని వారి జీవిత-పరిమాణ శిల్పాలను స్థాపించారు. ఇంకా దళిత ఉద్యమకారుల కృషిని తెలిపే వేదిక అది. డిసెంబరు 29 నుంచి 31, 2018లో చెన్నైలో మూడు రోజులపాటు కళా ఉత్సవం 'వానం' ను నిర్వహించారు. అందులో తమిళనాడులోని అనేకమంది కళాకారులు పాల్గొన్నారు.
     ఇంకా ఈ కేంద్రం 'కూగై తిరైపడ ఇయక్కం' (కూగై ఫిల్మ్‌ మూవ్‌మెంట్‌) ను ప్రారంభించింది. దీనిద్వారా సాహిత్యం, సినిమాల మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇంకా ఈ సంస్థ మద్రాస్‌ రికార్డ్స్‌ లేబుల్‌తో కలిసి 'ది కాస్ట్‌లెస్‌ కలెక్టివ్‌' అనే బ్యాండ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో నలుగురు ర్యాపర్‌లు, ఏడుగురు వాయిద్యకారులు, ఎనిమిది మంది సంగీతకారులు ఉన్నారు. ఇది తమిళనాడులోనే ప్రసిద్ధ జానపద సంగీత శైలి. ఈ బ్యాండ్‌పేరు 'జాతి భేద మాత్ర తమిళర్గల్‌'.
     ప్రస్తుతం ఒక్క తమిళమే కాదు. అన్ని ఇండిస్టీలలో రంజిత్‌ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది దర్శకులు సామాజిక కోణంలో సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. ఇది మంచి పరిణామం.