Oct 14,2021 20:23

మృతిచెందిన శ్రీనివాస్‌

ప్రజాశక్తి-సాలూరు : ఆన్‌లైన్‌ మోసానికి ఓ విద్యార్థి బలయ్యాడు. మనస్తాపంతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి పట్టణంలోని కుమ్మరిపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
పట్టణంలో కుమ్మరిపేటకు చెందిన గుల్లిపిల్లి కేశవ్‌ శ్రీనివాస్‌ (19) బిట్స్‌ పిలానీ కళాశాలలో బిఎస్‌సి కంప్యూటర్స్‌ సెకెండియర్‌ చదువుతున్నాడు. జనవరిలో ఆన్‌లైన్‌ జాబ్‌ కోసం రిజిష్టర్‌ అయ్యాడు. వర్క్‌ ఫ్రం హోం యాప్‌లో చేరి, తల్లి దగ్గర రూ.30 వేలు తీసుకుని, ఆ సంస్థకు చెల్లించాడు. ఈ కంపెనీ ఇచ్చిన టాస్క్‌ పూర్తి చేయకపోవడంతో కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వబోమని చెప్పడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లికి చెపితే మందలిస్తుందేమోనన్న భయంతో ఇంట్లోని తన గదిలో బుధవారం రాత్రి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై టౌన్‌ ఎస్‌ఐ ఫక్రుద్దీన్‌ కేసు నమోదు చేశారు.