
కదిరి టౌన్, నార్పల : ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను నష్టపోయారని, ప్రభుత్వం తక్షణం వీరికి నష్టపరిహారం అందజేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు డిమాండ్ చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇటీవల అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండల పరిధిలోని మూర్తిపల్లి, వరిగిరెడ్డిపల్లి, బత్తలపల్లి, అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని కేశేపల్లి, వెంకటాంపల్లి, నాయనపల్లి గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న మొక్కజొన్న, అరటి, చీనీ, కాయగూరల పంటలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో ఉమ్మడి అంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో అకాల వర్షం తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లినా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవన్నారు. ఒక ఎకరా మొక్కజొన్న పంట సాగు చేయాలంటే రూ.30 వేలు, టమోటాకు రూ.లక్ష పెట్టుబడులు అవుతాయన్నారు. ఇలా ప్రతి పంటకూ వేలాది రూపాయలను రైతులు ఖర్చు చేశారన్నారు. అకాల వర్షంతో ఈ పెట్టుబడులన్నింటినీ రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత విపత్తు జరగలేదన్నారు. ప్రభుత్వ పాలకులు స్వయంగా వచ్చి ఈ ప్రకతి ప్రళయాన్ని కళ్లారా చూసి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తనకు అవకాశం ఇస్తే అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని ఆయనకు వవరిస్తానని తెలియజేశారు. ఈక్రాప్ బుకింగ్ జరగలేదని చెప్పి రైతులకు పరిహారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ క్రాప్‌తో సంబంధం లేకుండా బాధిత రైతులు అందరికీ పరిహారం ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు కూడా పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలన్నారు. తక్షణం వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటంచి పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. ఆయా పంటల నష్టాన్ని బట్టి రైతులకు పూర్తి స్థాయి పరిహారాన్ని అందజేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులకు అండగా సిపిఎం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.రాంభూపాల్, సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, రైతు సంఘం సత్యసాయి జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శివన్న, శంకర్ రెడ్డి, వివి.రమణ, సిపిఎం కదిరి పట్టణ కార్యదర్శి జిఎల్.నరసింహులు, సిఐటియు నాయకులు ముస్తాక్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబ్జాన్, నార్పల మండల కార్యదర్శి కె.కుల్లాయప్ప, రాజా, రామాంజినేయులు, చంద్రమౌళి, ప్రభాకర్, చండ్రాయుడు, రామాంజినేయులు, నారాయణస్వామి, పాల్గొన్నారు.