Jun 23,2021 15:25

పోడూరు (పశ్చిమ గోదావరి ) : ఉపాధి పనుల్లో వేతనాలు దళితులకు వేరుగా, ఇతర కులాల వారికి వేరుగా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ఇత్తర్వులను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మూడే మొజేష్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని పోడూరు మండల పరిషత్‌ కార్యాలయం మందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలుపుతూ జూనియర్‌ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు, ఇతర కులస్తులకు వేరుగా కూలి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్చిలో మెమో విడుదల చేసిందన్నారు. దీనితో కులాల మధ్య విభేదాలు లేవనెత్తి మతత్వాన్ని రెచ్చగొడతుందని విమర్శించారు. ఈ మెమో వల్ల ఎస్సి, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు ఉపాధి పథకానికి దారి మళ్లించే ప్రమాదం ఉందన్నారు. ఈ మెమో రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చాయన్నారు. కరోనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 50 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల నుండి కూలీలు బయటపడేవరకు సమ్మర్‌ అలవెన్స్‌ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లి ప్రసాద్‌, బొంతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.