Nov 25,2021 10:12

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ సర్కార్‌పై బిజెపి రాజ్యసభ ఎంపి సుబ్రమణ్యన్‌ స్వామి గురువారం విరుచుకుపడ్డారు. పాలనలో ప్రతి అంశంపై దాదాపుగా ఈ ప్రభుత్వం విఫలమైందంటూ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ, బోర్డర్‌ సెక్యూరిటీ అంశాల్లోనూ వైఫల్యం చెందిందన్నారు. ఆఫ్గనిస్తాన్‌ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా చేతులేత్తేసిందని అన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసెస్‌ సమాచార భద్రత ఉల్లంఘనకు పాల్పడిందని ట్విట్టర్‌ ద్వారా మండిపడ్డారు. కాగా, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బుధవారం పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ రాజకీయ వేత్తలు జయప్రకాష్‌ నారాయణన్‌, పివి నరసింహారావు, చంద్రశేఖర్‌, రాజీవ్‌ గాంధీ, మోరార్జీ దేశాయిలతో పోల్చారు. చెప్పేదే మమతా చేస్తారని, చేసేదే ఆమె చెబుతారని అంటూ.. అది  అరుదైన గుణంగా అభివర్ణించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన మమతా.. సుబ్రమణ్యన్‌ స్వామిని కలిసిన సంగతి తెలిసిందే.

¿