Jul 31,2022 12:42

చెన్నై :   చదరంగం గురించి అందరికీ తెలిసిందే. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. అవతలి జట్టును చిత్తు చేస్తుంటారు. నలుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ పావులు మన ఎత్తులకు తగినట్లుగా సజీవంగా కళ్ల ముందుకి వచ్చి యుద్ధం చేస్తే ఇలా ఉంటుంది అన్న విధంగా ఓ వీడియోను తెరకెక్కించారు. తమిళనాడులోని పుదుక్కొట్టాయ్  కలెక్టర్‌ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో ఈ వీడియోకు ప్రాణం పోశారు. చెస్‌ బోర్డులో రాజు, మంత్రిగా, సైనికులుగా, గుర్రాలుగా, ఒంటెలుగా, ఏనుగులుగా మనుషులే వేషం ధరించి కదులుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్టుగా వీడియోను రూపొందించారు. చదరంగ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ వీడియోను రూపొందించినట్లు కవితా రాము తెలిపారు.

ఈ వీడియోను చూసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా ప్రశంసలు కురిపించారు. జిల్లా అధికార యంత్రాంగం చెస్‌ ఒలింపియాడ్‌ 2022ను ప్రచారం చేయడానికి ఎన్నో వినూత్న చర్యలు చేపట్టిందని మెచ్చుకున్నారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అనకుండా ఉండలేరు. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా 'ఇదో అద్భుతం. చదరంగంలో పావులు సజీవంగా వస్తే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు చూపించారు' అని పేర్కొన్నారు.

తమిళనాడు వేదికగా దేశంలోనే తొలిసారిగా 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలు జరుగుతున్నాయి. ఆగస్టు 10వరకు పోటీలు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు  భారత్‌తోపాటూ అమెరికా, ఉక్రెయిన్‌, జర్మనీ, కజకిస్తాన్‌, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్‌, డెన్మార్క్‌ వంటి 162 దేశాల నుండి 1,735 మంది క్రీడాకారులు వచ్చారు.

;