Jul 22,2021 00:00

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : వందల కోట్ల రూపాయల నగదు బదిలీ నిధులు అనర్హుల చేతికి వెళ్లిపోయినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఆర్థికశాఖ అంతర్గత అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు పలు పథకాల కిరద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ నిధులు అసలైన లబ్దిదారులకు కాకుండా ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లు, సుమారుగా 700 కోట్లకుపైగానే పక్కదారి పట్టినట్లు భావిస్తున్నారు. తాజాగా ఆర్ధికశాఖ మంత్రి నిర్వహించిన సమీక్షలో ఈ అరశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నగదు బదిలీ లబ్దిదారులకు సంబంధించి రీవేలిడేషన్‌ చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాథమికంగా కొంతమంది లబ్దిదారులను గుర్తించిన అధికారులు వారికి సంబంధించిన నిధులను నిలిపివేసినట్లు సమాచారం. ఒక పథకానికి సంబంధించి దాదాపు 90 వేల మంది మహిళా లబ్దిదారులకు నిధుల పంపిణీని నిలిపివేసినట్లు తెలిసింది. ఇలా ఉండగా, రీవాలిడేషన్‌ చేయాలంటే అది ఇప్పట్లో సాధ్యం కాదని ఆర్ధికశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దాదాపు రెండు కోట్ల మందికిపైగా ఉన్న లబ్దిదారుల వివరాలను అధ్యయనం చేసి, అనర్హులను గుర్తించాలంటే కనీసం ఏడాది పడుతుందని ఆ అధికారి అన్నారు.