Sep 14,2021 07:52

న్యూఢిల్లీ :  ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత భారీగా పెరుగుతుందని, దీంతో క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయని మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే పేర్కొన్నారు. ఒక యూనివర్శిటీ ఏర్పాటు చేసిన 'బిల్డింగ్‌ కాంపిటిటివ్‌ అడ్వాంటేజ్‌ త్రూ స్పోర్ట్స్‌ అనలిటిక్స్‌ అండ్‌ డేటా ఇంటెలిజెన్స్‌' అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుంబ్లే మాట్లాడుతూ.. క్రికెట్‌లో సాంకేతికత అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా అది ఆటకు మంచి చేస్తుందని, అందుకే అది ఆహ్వానించదగ్గ విషయమని, ఈ క్రమంలోనే క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయని అన్నారు. భవిష్యత్‌లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) విధానంలో మరిన్ని మార్పులు సంభవిస్తాయని, దీంతో ఏ క్రీడాకారుడూ 'డేటా ఇంటిలిజెన్స్‌'ను కొట్టిపారేయలేడని కుంబ్లే పేర్కొన్నారు. క్రికెట్‌లో ఇప్పటికే డీఆర్‌ఎస్‌ విధానం అమలు చేస్తున్నారని, అది ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. ఈ టెక్నాలజీ మున్ముందు మరింత కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఆటగాళ్లు ఈ మార్పులను ఆహ్వానిస్తే బాగుంటుందని లేకపోతే వెనుకపడిపోతారని ఆయన పేర్కొన్నారు. క్రీడా సమాఖ్యలు సైతం ప్రజలకు చేరువ అయ్యేందుకు సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటారని అభిప్రాయపడ్డారు. మరోవైపు క్రికెట్‌లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లు పెరిగేకొద్దీ 'డేటా ఇంటిలిజెన్స్‌' అధికమవుతుందని అంచనా వేశారు. ఆటలు ఎంత చిన్నగా మారితే డేటా ఇంటిలెజెన్స్‌ వినియోగం అంత ఎక్కువగా ఉంటుందని కుంబ్లే వివరించారు. టీవీలు, బ్రాడ్‌ కాస్టర్స్‌ ప్రభావం అధికంగా ఉండదన్నారు. ఆటలను ప్రజలకు చేరువ చేసేందుకు ఇన్ని రోజులు టీవీలు ఆ పాత్ర పోషించాయని, ఇకపై ఓటీటీలు వస్తాయని కుంబ్లే వివరించారు. ఈ మార్పుల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు.