Jun 20,2022 06:55

నలభై కోట్ల ప్రజ విప్లవ కంఠం నా గీతం
నేనెదిగిన మట్టి నాది
నాదేయని ఘోషిస్తా
నా సంపదకగ్గి పెట్టు
నీచుల బలిగావిస్తా
(మాతృసంగీతం - అనిసెట్టి)

2022వ సంవత్సరం ప్రముఖ అభ్యుదయ కవి అనిసెట్టి సుబ్బారావు శతజయంతి సంవత్సరం. అనిసెట్టి ఆధునిక సాహిత్యంలో విభిన్న రచనలను సమర్థవంతంగా నిర్వహించగలిగారు. ఏ ప్రక్రియ చేపట్టినా తనదైన ముద్ర వేశారు. అయితే అనిసెట్టి సాహిత్యం గురించి సమగ్ర సమాచారం గానీ, విశ్లేషణ గానీ లేదు. ఆ విషయాన్ని గమనించిన డా. పి.వి. సుబ్బారావు గారు అనిసెట్టి సాహిత్యంపై పరిశోధనకు పూనుకున్నారు. ఏదో మొక్కుబడిగా చేసినట్లుగా ఈ పరిశోధన అనిపించదు. పరిశోధకుడిగా సుబ్బారావు క్రియాశీలక పాత్ర ఇందులో కన్పిస్తుంది. విస్తృతంగా పరిశోధించారు. లోతైన అధ్యయనం చేశారు. ఆ పరిశోధనను 'అనిసెట్టి సాహిత్యానుశీలనం' పేరుతో ప్రచురించారు. జనవరి 2007లో ప్రథమ ముద్రణగా సాహితీలోకానికి అందించారు. ఈ శతజయంతి సంవత్సరం మళ్ళీ రెండో ముద్రణ తీసుకొచ్చారు. ఇందులో కొత్తగా డబ్బింగ్‌ పాటలను పరిశీలించారు. తులనాత్మకంగా పరిశీలించారు.
ఈ రోజుల్లో ఒక పరిశోధనా గ్రంథం రెండవ ముద్రణ పొందడం గుర్తించదగిన విషయం. డా.పి.వి.సుబ్బారావు నిరంతరం చదువుతూ, రాస్తూనే ఉంటారు. ఆయన ఉద్యోగ విరమణ పొందినా సాహిత్యంలో రిటైర్‌ కాలేదు. నిరంతరం రీచార్జ్‌ అవుతూ వ్యాసాలు రాస్తూనే ఉంటారు. ఉన్నత విద్యలో తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పనలో కూడా భాగస్వాములయ్యారు.
'అనిసెట్టి సాహిత్యానుశీలనం' అనే పరిశోధనా గ్రంథం ద్వారా సుబ్బారావు ఏం చెప్పదలచ్చుకున్నారు అనే ప్రశ్న వేసుకుంటే - ఆధునికాంధ్ర సాహిత్యంలో అనిసెట్టి స్థానాన్ని ఎలా గుర్తించాలో కొన్ని ఋజువులు ఇచ్చాడు. అనిసెట్టి స్థానాన్ని నిర్ణయించడానికి ఆయన కొన్ని ప్రమాణాలు నిర్ణయించుకున్నాడు.
1. అనిసెట్టి చేపట్టిన సాహితీ ప్రక్రియలు - వాటి నిర్వహణ
2. రచనల్లోని వస్తు వైవిధ్యం - వైశాల్యం
3. సమాజంలోని వర్గాల పట్ల రచయిత అవగాహన
4. సమకాలీన ఆర్థిక, రాజకీయ, సాంఘిక సంఘటనల పట్ల రచయిత స్పందన
5. సమకాలీన, తదనంతర రచయితలపై ప్రభావం
6. సాహితీ శిల్పిగా రచయిత పోకడలు
7. స్థిరపడిన సాహితీ ధోరణులను మించి రచయిత ప్రదర్శించిన మౌలికత - ప్రయోగాత్మకత
అనిసెట్టి గొప్ప ప్రతిభతో అన్ని సాహితీ ప్రక్రియలను స్ప ృశించాడు. చేపట్టిన ప్రతి ప్రక్రియను విజయవంతంగా పాఠకుల్లోకి తీసుకుని పోయారు. సమసమాజ స్థాపన, శాంతి, యుద్ధ విముఖత, సామ్యవాద ధోరణి మొదలైన అభ్యుదయ లక్షణాలలో రచనలు చేశారు. కార్మిక, శ్రామిక, కర్షక జన సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన చేసిన రచనలను పరిశోధకుడి సుబ్బారావు గారు గుర్తించారు, విశ్లేషించారు.
ఆంగ్ల సాహిత్యాన్ని ఆపోశన పట్టిన అనిసెట్టి ఫాంటోమైమ్‌, డ్యాన్స్‌ భాలే మొదలైన ప్రక్రియలను తొలిసారిగా తెలుగులోకి తీసుకొచ్చినట్టు పరిశోధకుడు తెలియజేశారు. తెలుగులో తొలి మూకాభినయంగా 'శాంతి' అనే నాటిక. ఇది అనిసెట్టి ప్రయోగాత్మకతకు ఉదాహరణ. అనిసెట్టి రచించిన బిచ్చగాళ్ళ పదాలు ప్రభావంతో తెలుగులో ఆరుద్ర కూనలమ్మ పదాలు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కన్యకమ్మ పదాలు, దేవిప్రియ నాయనమ్మ పదాలు, మసన చెన్నప్ప మల్లి పదాలు వచ్చినట్లు పరిశోధకుడు అంచనా వేశారు.
అనిసెట్టి రచించిన నాటకాల్లో సరికొత్త శిల్ప పోకడలను ప్రదర్శించినట్లు పరిశోధకుడు ఉదాహరణలను ఇచ్చాడు. ఆయన రాసిన 'గాలిమేడలు' నాటకంలో ప్రేక్షకాగారం నుంచి తొలిసారిగా పాత్రలను ప్రవేశపెట్టి, ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేశారు. ఇలాంటి అనేక సాక్ష్యాల ద్వారా అనిసెట్టి స్థానాన్ని పరిశోధకుడు మనముందుంచారు. అనిసెట్టి జీవితం గురించి, ఆయన రచనలు గురించి సమగ్ర సమాచారం ఇచ్చారు. అభ్యుదయ కవితోద్యమం, అరసం పునరుద్ధరణలో అనిసెట్టి ప్రమేయం గురించి వివరంగా పొందుపరిచారు.
పరిశోధకుడు తన పరిశోధనా సౌలభ్యం కోసం ఆరు అధ్యాయాలుగా విభజించుకున్నారు. అన్ని అధ్యాయాల్లోనూ పరిశోధకుడి చూపు, చదివించే శైలి కన్పిస్తుంది. 'అభ్యుదయ కవిత్వానుశీలనం' అనే అధ్యాయంలో సుబ్బారావు గారి కృషి గొప్పగా కనిపిస్తుంది. అనిసెట్టి నాటకాలు, రేడియో నాటికలు, నాటకాలు, కథలు, వ్యాసాలు, సినిమా పాటలు ఇలా అన్ని ప్రక్రియలను విశ్లేషించారు. అనిసెట్టి సాహిత్య శిల్పం గురించి సుబ్బారావు గారి విశ్లేషణ భావి పరిశోధకులకు చక్కగా ఉపకరిస్తుంది. శబ్దశిల్పం, చంద:శిల్పం, ప్రతీకాత్మకత, కవితాసూక్తులు, ఆంగ్ల పదాలు, అనిసెట్టి కవిత్వంలో మాండలిక పదాలు, రాజకీయ పదజాలం, ప్రయోగాత్మక ధోరణులు, నాటకాల్లో పాత్ర చిత్రణలు ఇలా అన్ని అంశాలను సూక్ష్మం నుంచి స్థూలం దాకా పరిశోధకుడు వివరణ చేశాడు. అనిసెట్టి కవిత్వంలో ఆకలి చిత్రణ, వేశ్యాజీవితం, నగర జీవిత చిత్రణ, అనాథ బాలల చిత్రణ, దేశ నాయక స్తుతి, మానవ జీవిత చిత్రణ, జాతీయోద్యమ స్ఫూర్తి మొదలైన అన్ని అంశాలను చక్కగా విశ్లేషించి పరిశోధకుడు ఫలవంతం అయ్యాడు.
కొన్ని వందల సంఖ్యల్లో విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. పేరు ముందు డాక్టరేట్లు చేరుతున్నాయి. వాటిలో ముద్రణారూపంలో వచ్చేవి చాలా తక్కువ. కానీ సుబ్బారావు గారు అనిసెట్టి సాహిత్యానుశీలనాన్ని సమగ్రంగా తీసుకొచ్చారు. ఇది ఉపరితల పరిశోధనేమీ కాదు.
'లేవరా ! లేవరా ! కూడు లేని సోదరా!
లోకపు సిరిసంపదలకు మనకూ హక్కుందిరా
లోకపు సౌందర్యానికి మనకూ హక్కుందిరా'

అని సామాన్యుల పక్షాన నిలిచిన కవి అనిసెట్టి. పై మూడు పాదాలు ఇప్పటికీ సమకాలీనంగానే అనిపిస్తున్నారు. ఇలాంటి కవి గురించి మంచి పరిశోధన చేసిన పి.వి.సుబ్బారావు గారు అభినందనీయులు.

                                  - డాక్టర్‌ సుంకర గోపాలయ్య 94926 38547