Jul 27,2022 09:46

న్యూఢిల్లీ :  మరో కాశ్మీరీ జర్నలిస్ట్‌ని ఢిల్లీలోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. జులైలో వరుసగా ఇది రెండో ఘటన కావడం గమనార్హం. ఎటువంటి కారణం లేకుండానే ఈ నెల 2వ తేదీన కాశ్మీరీ జర్నలిస్ట్‌ సన్నా ఇర్షాన్‌ మట్టూ ని విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. మానవ హక్కులు, డిజిటల్‌ టెక్నాలజీస్‌, దక్షిణ రాజకీయాలపై విశ్లేషణలు అందించే స్వతంత్ర కాశ్మీరీ జర్నలిస్ట్‌ ఆకాష్‌ హసన్‌ను శ్రీలంక వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్‌ను అధికారులు అడ్డుకున్నారు.

తనను విదేశాలకు వెళ్లకుండా నిలిపివేసినట్లు హసన్‌ ట్విటర్‌లో తెలిపారు. మంగళవారం రాత్రి 8.19 గంటలకు న్యూఢిల్లీలోని ఐజిఐ ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కొలంబ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకున్నారని ట్వీట్‌ చేశారు. ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాలపై నివేదికలు ఇచ్చేందుకు వెళ్లాలనుకున్నానని అన్నారు. పాస్‌పోర్ట్‌, బోర్డింగ్‌ పాస్‌లు తీసుకున్నారని, అనంతరం గత నాలుగు గంటలు వెయిటింగ్‌ రూమ్‌లో కూర్చోబెట్టారని అన్నారు. అయితే ఎందుకు అడ్డుకున్నది అధికారులు వివరణ నివ్వలేదని మరో ట్వీట్‌లో తెలిపారు. ఐదుగంటలు వెయిట్‌ చేయించారని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని అన్నారు. పాస్‌పోర్ట్‌, బోర్డింగ్‌ పాస్‌ను ప్రయాణానికి అనుమతించడం లేదంటూ (కాన్సిల్డ్‌) స్టాంప్‌ వేసి ఇచ్చారని అన్నారు. ఇది కాశ్మీరీ జర్నలిస్టులను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం నాలుగో ఘటన అని సీనియర్‌ జర్నలిస్ట్‌ పేర్కొన్నారు.