Nov 24,2022 07:23
  • ముక్కలు చేసి చంపేస్తాడని 2020లోనే ఫిర్యాదు

న్యూఢిల్లీ : శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో రోజుకొక విషయం వెలుగుచూస్తోంది. శ్రద్దా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా హత్య చేసి, 35 ముక్కలుగా నరికి శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేసిన సంగతి తెలిసిందే. తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని శ్రద్ధ ముందుగానే ఊహించింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలో రెండేళ్ల క్రితమే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు ఆమెను అఫ్తాబ్‌ కొట్టాడు. ఆమెకు ఊపిరాడకుండా చేసి, హత్య చేయాలనుకున్నాడు. 2020లో శ్రద్ధా వాకర్‌ ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాపై మహారాష్ట్రలోని వసారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను చంపి ముక్కలుగా నరికివేస్తానని బెదిరించాడని అందులో పేర్కొంది. 2020లో తులింజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రద్ధ ఫిర్యాదు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. అయినప్పటికీ మళ్లీ అతనితోనే ఆమె ఎందుకు ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.