Jun 29,2022 20:40
  • నగదు విత్‌డ్రాపై ఆర్థికశాఖ సమాధానం
  • విచారణ జరిపి స్పష్టత ఇస్తామన్న రావత్‌
  • ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఆందోళన
  • హైకోర్టుకు విన్నవించిన పిటిషనరు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉద్యోగులు జిపిఎఫ్‌ ఖాతాల్లో డబ్బు విత్‌డ్రా అయిన విషయం తమకు తెలియదని, విచారణ జరిపి స్పష్టత ఇస్తామని ఆర్థిఖశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగుల ఖాతాల్లోంచి డబ్బు విత్‌డ్రా అయిన నేపథ్యంలో బుధవారం ఉదయం ఉద్యోగ సంఘాల నాయకులు బండి శ్రీనివాస్‌, శివారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ తదితరులు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, సత్యనారాయణ తదితరులను కలిశారు. తాము విత్‌డ్రా చేయలేదని అధికారులు వివరించారు. దీంతో ఉద్యోగుల గొంతులో వెలక్కాయపడింది. ఇప్పటి వరకూ ఆర్థికశాఖ విత్‌డ్రా చేసిందని భావిస్తున్న ఉద్యోగులకు అసలు ఎవరు విత్‌డ్రా చేశారో కూడా తెలియకపోవడంతో మరింత గందరగోళానికి గురయ్యారు. సిఎఫ్‌ఎంఎస్‌లో జరిగిన పొరపాటు వల్ల సమస్య వచ్చి ఉండొచ్చని అధికారులు చెప్పారని ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. సిఎఫ్‌ఎంఎస్‌లో లోపం ఉంటే మాస్టర్‌ ఖాతాలోంచి డబ్బులు వెళ్లాలని, మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు ఎలా వెనక్కు వెళతాయని ప్రశ్నిస్తున్నారు. ఆర్థికశాఖ అధికారుల సమాధానం ఉద్యోగుల్లో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. దీనిపై రెండోరోజు కూడా వారికి స్పష్టత లేదు. అయితే విత్‌డ్రా అంశంపై కిందిస్థాయి అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో ఉద్యోగులు బయటకు వచ్చేశారు. దీనిపై ఎపి ఎన్‌జిఒ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డబ్బులు తాము తీసుకోలేదని అధికారులు చెబుతున్నారని అన్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 'మా డబ్బులు మాకు తెలియకుండా విత్‌డ్రా అయ్యాయంటే మిగిలిన డబ్బులకు గ్యారెంటీ ఏమిటి? అని ప్రశ్నించారు. అసలు తమ నగదు ఏ ఖాతాలోకి వెళ్లాయో తెలియాల్సి ఉందని అన్నారు.
కోర్టుకు విన్నవించిన పిటిషనరు
డబ్బు విత్‌డ్రా చేయడంపై పిటిషరు కృష్ణయ్య మరోసారి కోర్టుకు విన్నవించారు. గతేడాది ఇదే విధంగా డబ్బులు డ్రా చేయడంతో ఉద్యోగుల అనుమతి లేకుండా నగదు డ్రా చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. మరోసారి అదే విధంగా జరగడంతో కృష్ణయ్య హైకోర్టులో రిజాయిండర్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్యను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని కోరారు. పరిశీలించిన కోర్టు రెండువారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ప్రభుత్వ చర్యను నిరసించండి : జిపిఎఫ్‌ నిధుల విత్‌డ్రాపై సిఐటియు
జిపిఎఫ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విత్‌డ్రా చేయడాన్ని నిరసించాలని సిఐటియు పిలుపునిచ్చింది. 90 వేల మంది ఉద్యోగుల, ఉపాధ్యాయులకు సంబంధించిన రూ.800 కోట్లు డ్రా చేయడం అన్యాయమని యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ నర్సింగరావు, ఎంఎ గఫూర్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలకు తెలియకుండా విత్‌డ్రా చేయడం దుర్మార్గమని అన్నారు. గతంలో బిల్డింగ్‌ సెస్‌ను కూడా వందల కోట్లు బోర్డుకు తెలియకుండా విత్‌డ్రా చేసి ప్రభుత్వం ఖజానాలో జమ చేసుకుందని తెలిపారు. ఇది లక్షలాది మంది ఉద్యోగ కార్మికులకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. ఆ సంఘాలతో గానీ, సంబంధిత ఉద్యోగస్తులు, కార్మికులతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని, దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. విత్‌డ్రా చేసిన డబ్బును వెంటనే సంబంధిత ఖాతాల్లో జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.