Sep 14,2021 07:13
  • వివరాలివ్వాలని ఆర్థికశాఖకు ఎజి లేఖ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌డిసి) ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలు తేలడం లేదు. దాదాపు 18 వేల కోట్ల వరకు నిధుల వినియోగంపై వివరాలు కనిపిరచడం లేదని అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం చెబుతోంది. దీనిపై తక్షణం వివరాలివ్వాలని ఆర్ధికశాఖకు ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఎస్‌డిసి ద్వారా తీసుకున్న రుణాలను పిడి ఖాతాల్లోకి బదలాయించి, ఆ నిధులను పలు అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినప్పటికీ, అందుకు సంబంధించిన బిల్లులు, ఆ బిల్లుల వివరాలు తేల్చలేదని ఎజి కార్యాలయం అభిప్రాయపడింది.
    ఎజి కార్యాలయం ద్వారా లభించిన సమాచారం మేరకు 10,895 కోట్ల రూపాయలను మూడు బిల్లుల ద్వారా విత్‌డ్రా చేశారు. అయితే ఆ బిల్లులకు సరైన వివరాలు మాత్రం లేవని ఎజి కార్యాలయం గుర్తించింది. ఈ రుణం నుంచే 222 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసినప్పటికీ వివరాలు లేవని, దీనికి ఖాళీ బిల్లు జత చేసి ఉందని ఎజి అధికారులు అంటున్నారు. ఇదే తరహాలో 672 కోట్ల రూపాయల బిల్లుకు సంబంధించి కూడా వివరాలు లేవన్నది వారి వాదన. ఇవి మురిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో రెండు బిల్లుల ద్వారా 227 కోట్లను ఆర్ధికశాఖ విత్‌డ్రా చేసింది. ఇవి స్వీయ విత్‌డ్రాయల్స్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారు, ఆ వివరాలు ఏమిటన్నది కూడా ఎజి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక 6,223 కోట్ల రూపాయలను ఎస్‌డిసి నుంచి పిడి ఖాతాలకు బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని అమ్మఒడి పథకానికి వెచ్చించారు. ఈ నిధులను ఏకంగా 63 పిడి ఖాతాలను మళ్లించడం గమనార్హం. వీటిపైనా ఎజి కార్యాలయం వివరాలు కోరినట్లు సమాచారం. ఇలా దాదాపు 18 వేల కోట్ల రూపాయల వివరాలు ఇంకా తేలకపోవడాన్ని ఎజి కార్యాలయం గుర్తించడం, ఆ వివరాలను అందించాలని కోరడంతో ఆర్ధికశాఖ ఇబ్బందుల్లో పడుతున్నట్లు తెలిసింది. ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ ద్వారా వచ్చిన రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడాన్ని గతం నుంచి తప్పు పడుతున్న నేపథ్యంలో ఈ రుణాలకు వివరాలే లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.