ప్రజాశక్తి - ఆకివీడు : సుమారు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన బుధవారం సంత మార్కెట్‌ను ప్రస్తుత స్థల నుంచి మార్కెట్ యార్డ్‌కు తరలించడం సముచితం కాదని వ్యాపారులు గురువారం కమిషనర్ కృష్ణమోహన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో తమ వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తమకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సంతను ఇక్కడి నుంచి మార్చేస్తున్నారనీ అవసరమైతే కమీషనర్ ని కలవడంటూ చెప్పారని, తమ పరిస్థితిని విరించేందుకు వచ్చామని వారు చెప్పారు.
స్థానిక బుధవారం సంత మార్కెట్ ను ప్రస్తుతం ఉన్న స్థలం నుండి మార్కెట్ యార్డ్ ఆవరణలోకి తరలించినట్లు కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో అమృత జల పథకంలో కేంద్ర ప్రభుత్వం నుండి 72 కోట్ల రూపాయలు వాటర్ ట్యాంకులు నిర్మాణానికి మంజూరయ్యాయని ఆయన చెప్పారు. వాటి నిర్మాణం కోసం సంతను వేరొక చోటికి తరలించి అక్కడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఆదేశించారని ఆయన చెప్పారు. కమిషనర్ తో ఉన్న వైస్ చైర్ పర్సన్ పుప్పాల సత్యనారాయణ పండు మాట్లాడుతూ రెండు నెలల క్రితమే సంత మార్కెట్ను అక్కడ నుండి వేరొక చోటికి తరలించడానికి నగర పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందని చెప్పారు. ప్రస్తుతం వ్యాపారులకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంతం అనువైనదిగా భావిస్తున్నామని, అక్కడికి వెళ్లాలని కమిషనర్ తెలిపారు.
అయితే తమకు ఆ ప్రాంతం వ్యాపారానికి అనుకూలం కాదని వ్యాపారస్తులు వివరించారు. మార్కెట్కు వచ్చే కొనుగోలుదారులు 70 శాతం స్త్రీలే ఉంటారని ఊరు దాటి మార్కెట్ యార్డుకు మహిళలు రారని అన్నారు. మార్గమధ్యలో డైలీ మార్కెట్ కూరగాయల దుకాణాలు ఉన్నాయని, వ్యాపారం అంతా అక్కడికి వెళ్ళిపోతుందని అన్నారు. తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యేతో చర్చించి చెబుతానని కమిషనర్ కృష్ణమోహన్ హామీ ఇచ్చారు.








కామెంట్‌లు (0)