సిఎస్ సాయి ప్రసాద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గోదావరి పుష్కరాలు సందర్భంగా స్నాన ఘట్టాల వారీ యాత్రికుల రద్దీ నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. పుష్కరాల విశిష్టతను ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పేందుకు ‘స్నానం–దానం–పితృతర్పణం’ వంటి నినాదాలతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు పాల్గొనేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రతి స్నాన ఘట్టం వద్ద ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేసి నడక దూరం, రవాణా సౌకర్యాలపై స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. అలాగే మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రముఖ స్వామీజీలు, ప్రవచనకర్తల సూచనలు, సలహాలు తీసుకుని వాటిని పుష్కరాల నిర్వహణ ప్రణాళికలో భాగం చేయాలన్నారు. రైలు, రోడ్డు మార్గాల ద్వారా లక్షలాదిగా వచ్చే యాత్రికుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ, గత గోదావరి పుష్కరాలకు సుమారు 4.80 కోట్ల మంది హాజరుకాగా, వచ్చే ఏడాది ఆ సంఖ్య రెట్టింపునకు పైగా ఉండే అవకాశం ఉందన్నారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో రూ.3,161 కోట్ల అంచనాతో 21 శాఖల ద్వారా 4,695 పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.60 కోట్ల విలువైన పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)