శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సుగాలి ప్రీతి తల్లి 'వీల్‌ చైర్ యాత్ర' అడ్డగింత

19 ఆగస్టు, 2026

Tension in Kurnool – Sugali Preethi's mother's wheelchair rally obstructed.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 12:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కర్నూలులో ఉద్రిక్తత

  • నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం ఆగదు : మృతురాలి తల్లి పార్వతి

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : తన కుమార్తె సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లి పార్వతి చేపట్టిన వీల్‌చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డు సమీపంలోని సుగాలి ప్రీతి సమాధి వద్ద నుంచి అమరావతి వరకు వీల్‌చైర్‌లో యాత్ర ప్రారంభించేందుకు ఆమె ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వ అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను ఆపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పార్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు బిడ్డను కోల్పోయిన బాధ నన్ను వెంటాడుతుంటే, మరోవైపు న్యాయం కోసం ఇలా వీల్‌చైర్‌లో రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సి రావడం మరింత కలచివేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం నిందితుల కొమ్ముకాస్తోందని ఆరోపించారు. తన వైకల్యాన్ని, అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా యాత్రకు శ్రీకారం చుట్టానని, నా బిడ్డకు జరిగిన అన్యాయంపై పూర్తి నిజాలు బయటకు రావాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

లిబరల్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం

న్యాయం కోసం యాత్ర చేపట్టిన బాధిత తల్లిని పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం సరికాదని లిబరల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఐఎఎస్ విజయ్‌కుమార్ అన్నారు. యాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. అడ్వకేట్ రజని సంఘీభావం తెలిపారు.

వీల్‌చైర్‌ను చూసి ప్రభుత్వం భయపడుతోంది : ప్రజా సంఘాలు

ప్రీతి తల్లి చేపట్టిన వీల్‌చైర్ యాత్రను అడ్డుకోవడాన్ని విద్యార్థి, యువజన, మహిళా ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కర్నూలు కొత్త బస్టాండ్ వద్దగల డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల సమన్వయ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.ఆనంద్ బాబు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అరుణ, ఎఐఎస్‌ఎఫ్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఆర్‌విఎస్ జిల్లా కార్యదర్శులు షాబీర్ బాషా, అబ్దుల్లా, రంగప్ప, గురుశేఖర్‌ మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. సుగాలి ప్రీతి 9వ వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి వద్ద నుండి అమరావతికి చేపట్టిన వీల్‌చైర్ యాత్రను పోలీస్ బెటాలియన్లతో అడ్డుకోవడం దారుణమని, వీల్‌చైర్ యాత్ర పేరు వింటేనే రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే నిర్బంధాలను వీడి సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్