శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమల డిప్యూటీ ఇఒ లోకనాథం అరెస్టు

2 రోజుల క్రితం

arrest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 09:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నెల్లూరు ఎసిబి కోర్టుకు తరలింపు

ప్రజాశక్తి - తిరుమల: టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకనాథంను అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. అక్రమ ఆస్తుల కేసులో లోక్‌నాథం, ఆయనతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఎసిబి అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గురువారం కూడా సోదాలు కొనసాగాయి. ఆస్తి పత్రాలు, బంగారం, వెండి, నగదుతో సహా కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లో ఆయన నివాసం నుంచి లోకనాథంను ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ నిమిత్తం నెల్లూరు ఎసిబి కార్యాలయానికి తరలించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ చేశారనే వ్యవహారంపై సిబిఐ జరిపిన దర్యాప్తులో వెల్లడైన సమాచారం ఆధారంగా లోకనాథం నివాసంపై సోదాలు జరిగాయని ఎసిబి వర్గాలు తెలిపాయి. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై సిబిఐ దర్యాప్తులో టిటిడికి చెందిన కొందరు ఉద్యోగులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. దీంతో పలువురిపై సిబిఐ నేతృత్వంలోని సిట్‌ కేసు నమోదు చేయగా, మరికొందరి పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. వారిపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సూచించింది. నెయ్యి సరఫరాదారులను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై, అప్పటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కె.చిన్న అప్పన్నపై ఎసిబి విశాఖపట్నం విభాగం కేసు నమోదు చేసింది. ఈ దర్యాప్తునకు కొనసాగింపుగా ఎసిబి అధికారులు లోకనాథం వ్యవహారంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఎసిబి అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తిరుపతిలోని లోకనాథం నివాసం, నగరంలోని ఆయన బంధువులలో ఒకరి ఇల్లు, ఏర్పేడులోని ఆయన పూర్వీకుల ఇల్లు, తిరుమలలోని ఆయన అధికారిక కార్యాలయంపై ఏకకాలంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా లోకనాథం కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా సంపాదించినట్లు భావిస్తున్న పలు ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయని ఎసిబి ఒక ప్రకటనలో తెలిపింది. సోదాల సందర్భంగా లోకనాథం ఇంట్లో రూ.ఐదు కోట్ల విలువైన ఆస్తులు, రెండు కిలోల బంగారం, ఏడు కిలోల వెండి, రూ.12 లక్షల నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్