బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 15న జాతీయ సమైక్యతా దినోత్సవం

07 జులై, 2026

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- తిరుపతిలో ‘సామాజిక శంఖారావం` సదస్సు పిలుపు

- టిటిడి చైర్మన్‌గా, ఆలయాల్లో పూజారులుగా దళితులను నియమించగలరా?

- రాష్ర్ట ప్రభుత్వానికి సవాలు

ప్రజాశక్తి - తిరుపతి సిటీ : దళితుల ఆత్మగౌరవం కోసం, కులవివక్ష లేని సమాజం కోసం జరుగుతున్న సామాజిక శంఖారావాన్ని జయప్రదం చేయాలని దళిత శోషణ్‌ ‌ముక్తి మంచ్‌ ‌జాతీయ నాయకులు వి. శ్రీనివాసరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఆగస్టు 15న జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రతిగుడి ముందు జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. టిటిడి చైర్మన్ గా, ఇఒగా, ఆలయ ప్రధాన పూజారులుగా దళితులకు అవకాశం ఇచ్చే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా? అని సవాలు విసిరారు. అధ్యయన యాత్రలు, ఆందోళనలు, ప్రత్యక్ష కార్యాచరణ రూపాల్లో సామాజిక శంఖారావాన్ని నిర్వహించాలన్నారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి యశోదానగర్‌ ‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లా సామాజిక శంఖారావం సదస్సు మంగళవారం జరిగింది. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేష్ అధ్యక్షత వహించారు. సామాజిక శంఖారావం కార్యాచరణను వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ వివరించారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈనెల 15 నుంచి ఆగస్టు 24 వరకూ దశల వారీగా కార్యక్రమం ఉంటుందన్నారు. మొదటి దశలో భాగంగా క్షేత్రస్థాయిలో కులవివక్ష రూపాల అధ్యయనం చేయాలన్నారు. అనంతరం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కులవివక్షపై ఆందోళనలు నిర్వహించాలన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆలయాల ముందు జాతీయ జెండాలను ఎగురవేసి , జాతీయ సమైక్యతను చాటాలన్నారు. వివక్షకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులను, యువతను ఈ శంఖారావంలో భాగస్వాములను చేయాలన్నారు. మత విద్వేషాలు రగులుస్తున్న నరేంద్ర మోడీ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందన్నారు. ఏ అయోధ్య రామాలయం వారిని అధికారంలో కూర్చోబెట్టిందో, ఆ ఆలయమే వారిని కూలుస్తుందని హెచ్చరించారు. సామాజిక వివక్షకు గురవుతున్న వారికి అన్ని ప్రజా సంఘాలు, లౌకిక, అభ్యుదయ వాదులు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ... కుల సమస్య అనేది భారతదేశంలో తప్ప ఏ దేశంలో లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో పచ్చికాపల్లం మహాభారతం సందర్భంగా తలెత్తిన వివక్షపై సిపిఎం, కెవిపిఎస్ సంయుక్తంగా పోరాడిన సందర్భంగా అధికార యంత్రాంగం దిగివచ్చి సమస్యను పరిష్కరించిందని గుర్తు చేశారు. పోరాటాల ఫలితంగానే ఎస్‌‌సి, ఎస్‌‌టి సబ్‌‌ప్లాన్‌ ‌చట్టం, జిఒ నంబర్‌ 1235 సాధించుకున్నామన్నారు. అభివృద్ధిలోనూ వివక్ష కొనసాగుతోందన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కేటాయించే నిధుల్లో 25 శాతం దళితవాడలకు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. తిరుమల కల్తీ లడ్డూపై సనాతన ధర్మానికి ప్రతినిధినంటూ చెప్పుకునే డిప్యూటీ సిఎం... కులవివక్షపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర నాయకులు వెంకట్రావు మాట్లాడుతూ... అద్దె ఇళ్ల కోసం వెతుకుతుంటే కుల ప్రస్తావన లేకుండా ఇళ్లు ఇవ్వడం లేదన్నారు. దళితులకు స్మశానాలు చూపకపోగా, ఉన్న వాటిని కబ్జా చేస్తున్నారని విమర్శించారు. వ్యకాసం జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ... సంక్షేమ పథకాల అమలులోనూ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, హేమలత, సాయిలక్ష్మి, టి.సుబ్రమణ్యం, జయచంద్ర, పవిత్ర, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్